రాత్రి భోజనం వడ్డించలేదనీ భార్యను చంపేసిన భర్త.. ఎక్కడ?

సోమవారం, 24 జులై 2023 (12:06 IST)
కొందరు భార్యాభర్తలు చిన్న చిన్న విషయాలకే గొడవపడుతుంటారు. ఇలాంటి గొడవలు చివరకు ప్రాణాలకే ముప్పు తెచ్చిపెడుతున్నాయి. తాజాగా ఓ భర్త క్షణికావేశంలో తన భార్యను చంపేశాడు. రాత్రి భోజనం వడ్డించలేదన్న కోపంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ దారుణం రాజస్థాన్ రాష్ట్రంలోని జోథ్‌పూర్ జిల్లాలో జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన రమేష్ బేనివాల్ (35), సుమన బేనివాల్ అనే దంపతులు ఉండగా, వీరికి 15యేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. రమేష్ ఒక వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే వృత్తిరీత్యా రమేష్ తరచుగా జోథ్‌పూర్‌కు వెళ్లి వచ్చేవాడు. 
 
అలాగే, గత శనివారం రాత్రి కూడా రమేశ్ జోథ్‌పూర్ వెళ్లి ఇంటికి ఆలస్యంగా వచ్చాడు. భార్యను భోజనం వడ్డించమని అడగ్గా ఆమె నిరాకరించింది. దీంతో భర్త కోపంతో ఊగిపోయాడు. ఇంట్లో ఉన్న బండరాయితో ఆమె తలపై బాదాడు. ఆ రాయి తలకు బలంగా తగలడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. 
 
ఆ తర్వాత రమేష్.. తన బావమరిదికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాడు. దీంతో అతను పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అరెస్టు చేసి.. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు