రాంగ్‌రూట్‌లో వచ్చిన కారు.. అడ్డుకున్న యువతి.. ఈడ్చుకెళ్లిన డ్రైవర్

శుక్రవారం, 18 ఆగస్టు 2023 (09:19 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో దారుణ ఘటన ఒకటి జరిగింది. హనుమాన్‌‌గఢ్ జిల్లాలో రాంగ్‌రూట్‌లో వచ్చిన కారును యువతి అడ్డుకుంది. కానీ, కారు డ్రైవర్ ఆపకుండా కారును ముందుకు పోనిచ్చాడు. దీంతో ఆ యువతి కారు బానట్‌పై కొంతదూరం వెళ్లింది. ఇది చూసిన స్థానికులు ఆ యువతిని రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 
 
ఆ రహదారిలో సీసీటీవీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాల మేరకు.. జంక్షన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కారు రాంగ్ సైడులో వచ్చింది. ఇంతలో ఓ యువతి ఆ కారుకు అడ్డం వచ్చినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఆ క్రమంలో కారు యువతిపైకి వెళ్లగా ఆమె రక్షణగా బానెట్‌ను పట్టుకుంది. అయితే డ్రైవర్ కారును ఆపకుండా అలాగే ముందుకు పోనిచ్చాడు. అలా దాదాపు 500 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లాడు.
 
ఇది చూసి స్థానికులు కారు వెంట పరుగులు తీశారు. అయినా డ్రైవరు కారును ఆపలేదు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన కారును గుర్తించామని జంక్షన్ స్టేషన్ ఇంఛార్జ్ విష్ణు ఖత్రి తెలిపారు. అయితే ఈ కేసులో దర్యాప్తు చేపట్టినప్పటికీ బాధితురాలి నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు.
 
బాలికను 10 సార్లు కత్తితో పొడిచిన ప్రేమోన్మాది.. ఎక్కడ? 
 
ఓ ప్రేమోన్మాది ప్రేమ పేరుతో ఓ మైనర్ బాలికను 10 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు. ఈ దారుణం మహారాష్ట్రలోని కళ్యాణ్ జిల్లాలో జరిగింది. ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే, కల్యాణ్ జిల్లాలోని తిస్‌గావ్‌కు చెందిన ఓ బాలిక (12)ను ఆదిత్య కాంబ్లే (20) అనే యువకుడు ప్రేమ పేరుతో గత కొంతకాలంగా వేదిస్తున్నాడు. కానీ, అతని ప్రేమను ఆ బాలిక తిరస్కరించింది. దీంతో బాలికపై అతను కోపం పెంచుకున్నాడు. 
 
ఈ క్రమంలో బుధవారం సాయంత్రం ఆ బాలిక తన తల్లితో కలిసి ట్యూషన్‌కు వెళ్లి వస్తుండగా ఆమెపై దాడి చేశాడు. తన ప్రేమను తిరస్కరించిందనే నెపంతో ఆమె తల్లి ముందే విచక్షణారహితంగా బాలికను 10 సార్లు కత్తితో పొడిచాడు. కత్తి పోట్లకు గురైన బాలిక చికిత్స పొందుతూ మృతి చెందింది. బాలికపై దాడి చేసిన తర్వాత నిందితుడు ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాంబ్లే పై ముందుగా హత్య కేసు, తర్వాత ఆత్మహత్యకు యత్నించినందుకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు గురువారం తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి