తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు రాజకీయాల గురించి తెలియదని.. ఆయన కేవలం నటుడు మాత్రమేనని.. రాజకీయ నాయకుడు కాదని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తమిళనాడులో రాజకీయ నాయకులే గొప్ప నటులని స్వామి ఎద్దేవా చేశారు. మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసుపై కూడా స్వామి స్పందించారు.
విజయ్ మాల్యా అరెస్టు ఆరంభం మాత్రమే, తదుపరి లక్ష్యం లలిత్ మోడీనే అని పేర్కొన్నారు. కాగా, వివిధ బ్యాంకులకు దాదాపు రూ.9వేల కోట్ల రుణాలు బకాయిపడి లండన్‌లో తలదాచుకున్న విజయ్ మాల్యాను స్కాట్లాండ్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కానీ అరెస్టయిన మూడు గంటల్లోపే మాల్యా విడుదలయ్యాడు.
అంతేగాకుండా విడుదలైన సందర్భంగా ఇండియా మీడియా ఓవరాక్షన్ చేస్తుందని కామెంట్స్ చేశాడు. తాను భారతీయుడనే మాటను మర్చిపోయినా.. దేశ మీడియాపై ఫైర్ అయ్యాడు. అరెస్ట్ అయిన కేవలం మూడు గంటల్లోనే బెయిల్ సంపాదించుకుని బయటకొచ్చేసిన మాల్యా.. దీనికి సంబంధించి ఒక ట్వీట్ కూడా ఇచ్చారు. ఇదంతా ఊహించినదేనని, ఇండియన్ మీడియా అనవసర ఆర్భాటం చేసిందంటూ పోస్ట్ చేశారు.