తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అయోధ్యలో రామజన్మభూమి స్థలాన్ని చదును చేసే ప్రక్రియకు ఇటీవల శ్రీకారం చుట్టారు. ఇందులోభాగంగా, పుష్ప కలశం, ఐదడుగుల శివలింగం, విరిగిన దేవతా విగ్రహాలు, ఏడు నల్లరాతి స్థంభాలు, ఆరు ఎర్రరాతి స్థంభాలు లభించాయి.
ఈ అంశంపై రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మీడియాతో మాట్లాడారు. ఈ నెల 11 నుంచి కార్మికులు రామజన్మభూమి స్థలం చదును చేసే పనుల్లో మొత్తం 10 మంది కార్మికులు ఈ పనిలో నిమగ్నమయ్యారని, వారు, భూమిని చదును చేస్తుంటే ఈ విగ్రహాలు బయటపడినట్టు తెలిపారు. అంటే.. ఇది రాముడు జన్మస్థావరం అని దేవతా విగ్రహాలు కూడా నిరూపిస్తున్నాయని తెలిపారు.
ఇకపోతే, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ స్పందించారు. గతంలో జరిపిన తవ్వకాల్లోనూ అవశేషాలు, ఆధారాలు లభించాయన్నారు. చంపత్ రాయ్ ప్రస్తుత ప్రకటన ద్వారా అది మరోమారు స్పష్టమైందని రామ్ మాధవ్ తెలిపారు. ఇప్పుడు కూడా ఆధారాలు లభిస్తున్నాయని చెప్పారు. పని కొనసాగుతోందని, తవ్వకాలు జాగ్రత్తగా జరుపుతున్నారని చెప్పారు. ప్రస్తుతం రామ మందిర నిర్మాణ ప్రక్రియ ట్రస్ట్ ఆధ్వర్యంలో సురక్షితంగా ఉందని రామ్ మాధవ్ చెప్పారు.
అయోధ్య రామజన్మభూమి స్థలాన్ని హిందువులకు అప్పగిస్తూ 2019 నవంబర్ 9న సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీంతో దశాబ్దాల పాటు కొనసాగుతూ వచ్చిన అయోధ్య వివాదానికి గత యేడాతి పరిష్కారం లభించినట్టయింది. అదేసమయంలో అయోధ్యలో మరో చోట మసీదు నిర్మాణానికి 5 ఎకరాల భూమి సున్ని సెంట్రల్ వక్ఫ్ బోర్డుకు కేటాయించాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.