అమెరికాకు చెందిన జర్నలిస్టు పల్లవి గొగోయ్ మాజీ మంత్రి, జర్నలిస్టు ఎంజె అక్బర్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అక్బర్ తనతో బలవంతంగా, అధికార దర్పంతో సంబంధాలు పెట్టుకున్నాడన్నారు. మహిళా జర్నలిస్టు సమ్మతితోనే ఆమెతో తాను లైంగిక సంబంధాలు పెట్టుకున్నానని అక్బర్ చెప్పడాన్ని గొగోయ్ ఖండించారు.
తాను భారత్‌లో ఆయన పరిధిలోని పత్రికలో పనిచేస్తున్నప్పుడు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు పల్లవి గొగోయ్ ఆరోపించారు. తాను నిజాలే చెపుతానని, నేరానికి పాల్పడి అబద్ధాలకు దిగే అక్బర్ బాపతు కాదని పల్లవి తమ ట్విట్టర్‌లో తెలిపారు. తనపై అక్బర్ అత్యాచారానికి పాల్పడిన అంశం గురించి వాషింగ్టన్ పోస్టుకు తాను ఇచ్చిన ఇంటర్వూలోని ప్రతి అక్షరంతో తాను కట్టుబడి ఉంటానని ఆమె స్పష్టం చేశారు.
ఇంకా 1994 ప్రాంతంలో తమ ఇద్దరి మధ్య లైంగిక సంబంధం ఏర్పడిందని.. ఇది సమ్మతితోనే జరిగిందని అక్బర్ చెప్పారు. కానీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని లైంగిక వాంఛలు తీర్చుకున్నాడని, దీనికి సమ్మతి ముద్ర తగిలించాలని చూస్తున్నారని పల్లవి మండిపడ్డారు.