రూ.500, రూ.1000 నోట్ల రద్దుకు బీఎస్పీ అధినేత్రి మాయావతి రాజకీయాలు అంటగట్టారు. మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు సంచలనాత్మక నిర్ణయంతో వచ్చే ఏడాది జరిగే ఉత్తరప్రదేశ్ ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్న నేపథ్యంలో.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసమే పాత నోట్లను రద్దు చేయాలనే నిర్ణయం తీసుకున్నారని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం తన అసమర్థతను, అత్యవసర పరిస్థితిని కప్పిపుచ్చుకునేందుకే.. ఇలాంటి సంచలన నిర్ణయాలు తీసుకుందని మండిపడ్డారు.
నోట్ల రద్దు వల్ల లాభపడేది ఒకటి మహారాష్ట్ర, మరొకటి గుజరాతేనని మాయావతి అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేగాకుండా వచ్చే ఏడాది జరిగే యూపీ ఎన్నికల్లో లబ్ధిపొందాలనే ఉద్దేశంతోనే పెద్ద నోట్లను మోడీ రద్దు చేయాలనే నిర్ణయానికి వచ్చారన మాయావతి విరుచుకుపడ్డారు. నిజంగా నల్లధనం రద్దు కోసమే గనుక అయితే.. రెండేళ్ల క్రితమే ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోలేదని మాయావతి ప్రశ్నించారు.