గురువారం సాయంత్రం ఇఫ్తార్ విందుకు వెళ్లేందుకు కార్యాలయం నుంచి బయటకు రాగానే అక్కడే కాపుకాసిన ఉగ్రవాదులు అతిసమీపం నుంచి షుజాత్‌ను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరపడంతో ఆయన అక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచారు. ఆయన సెక్యూరిటీ గార్డు, వాహన డ్రైవర్‌పైనా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
ఉగ్రవాదుల దుశ్చర్యను పార్టీలకతీతంగా దేశంలోని నేతలంతా ఖండించారు. షుజాత్ హత్య హేయమని సీఎం మెహబూబా ముఫ్తీ అన్నారు. ఇది పిరికిపంద చర్య అని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించగా, షుజాత్ హత్య తనను తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసిందని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు.