ఐఏఎస్ అధికారిణితో ఎమ్మెల్యే వివాహం.. 3 లక్షల మందికి ఆహ్వానం

శనివారం, 9 డిశెంబరు 2023 (09:58 IST)
హర్యానా రాష్ట్రానికి చెందిన ఓ ఎమ్మెల్యే ఐఏఎస్ అధికారిణిని వివాహం చేసుకోనున్నారు. వీరిద్దరి వివాహానికి ఏకంగా మూడు లక్షల మందికి ఆహ్వానం పంపించారు. ఆ వరుడు పేరు భవ్య బిష్ణోయ్.. కాగా, అధికారిణి పేరు పరి బిష్ణోయ్. వీరి పెళ్లికి రెండు రాష్ట్రాల నుంచి 3 లక్షల మందిని ఆహ్వానిస్తున్నారు. 
 
భవ్య బిష్ణోయ్ హర్యానా మాజీ సీఎం భజన్ లాల్ మనవడు. భవ్య బిష్ణోయ్ పేరు వినిపించడం ఇదే కొత్త కాదు. అతడికి గతంలో టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్‌తో నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ, కొన్ని నెలలకే అది రద్దయింది. భవ్య బిష్ణోయ్ బీజేపీ యువ నేత. అదరంపూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 
 
ఇక పరి బిష్ణోయ్ స్వస్థలం రాజస్థాన్. ఆమె 2019లో సివిల్స్‌కు ఎంపికై సిక్కిం క్యాడర్ కింద విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు భవ్య బిష్ణోయ్, పరి వివాహంతో ఒక్కటి కాబోతున్నారు. వీరి నిశ్చితార్థం గత ఏప్రిల్ నెలలో జరిగింది. డిసెంబరు 22న వీరి పెళ్లి జరగనుంది. 
 
కాగా, ఈ పెళ్లి కోసం పుష్కర్, అదంపూర్, ఢిల్లీలో వేర్వేరుగా రిసెప్షన్లు నిర్వహిస్తున్నారు. ఢిల్లీతో పాటు హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి 3 లక్షల మందిని ఆహ్వానిస్తున్నారు. భవ్య బిష్ణోయ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక్క అదంపూర్ నియోజకవర్గంలోనే 80 గ్రామాల ప్రజలను విందుకు పిలుస్తున్నారు. ఈ పెళ్లి ఐఏఎస్ అధికారిణి పరి బిష్ణోయ్ సొంత రాష్ట్రం రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్‌లో అంగరంగ వైభవంగా జరుగనుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు