ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం పాకిస్థాన్‌ను తీవ్ర షాక్‌కు గురిచేసింది. ముఖ్యంగా భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్న పాక్ ఆ దేశంలోని ఏకంగా ప్రింటింగ్ ప్రెస్‌లలో పెద్దమొత్తంలో నకిలీ నోట్లను ముద్రిస్తూ ఉగ్రవాదుల ద్వారా భారత్‌కు అక్రమంగా రవాణా చేస్తోంది. రవాణాకు సులభంగా ఉంటుందనే ఉద్దేశంతో రూ.1000, రూ.500 నోట్లనే ఎక్కువగా ముద్రిస్తోంది. పాక్‌లో ముద్రితమవుతున్న ఈ నోట్లను బంగ్లాదేశ్, శ్రీలంక మీదుగా భారత్‌లోకి చొప్పిస్తోంది.
ప్రస్తుతం దేశంలో రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేస్తూ ప్రధాని తీసుకున్న నిర్ణయం స్వదేశంలో కంటే దాయాది పాకిస్థాన్‌లోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. మోడీ నిర్ణయం ఆ దేశంలోని ఉగ్రవాదులు, మాఫియాకు కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. భారత్‌లోకి ఉగ్రవాదులను చొప్పిస్తున్న పాక్ వారికి పెద్ద మొత్తంలో నకిలీ నోట్లు ఇచ్చి పంపిస్తోంది. ఏటా కొన్ని వందల కోట్ల రూపాయల నోట్లను భారత మార్కెట్లోకి పాక్ ప్రవేశపెడుతోంది.
నకిలీ నోట్లు పెరిగిపోవడంతో అసలు రూపాయల విలువ పడిపోతోంది. ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. పాకిస్థాన్‌కు కూడా కావాల్సింది ఇదే. మరోవైపు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మాఫియా వందల కోట్ల నకిలీ కరెన్సీని చలామణి చేస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొన్ని వందల కోట్ల నకిలీ కరెన్సీ ఉన్నట్టు అంచనా. ప్రభుత్వ నిర్ణయంతో ఇప్పుడు ఇదంతా రద్దయినట్టే. కొత్త ఫీచర్లతో నకిలీ నోట్లు ముద్రించాలంటే పాకిస్థాన్ భారీగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అందుకు సమయం కూడా చాలా పడుతుంది. అంటే ఒక్క దెబ్బతో ఇటు దేశంలోని నల్ల కుబేరులను, అటు పాకిస్థాన్‌ను ప్రధాని మోడీ చావుదెబ్బ కొట్టారు.