అఖిలేష్ సంచలన నిర్ణయం... కేబినెట్ నుంచి బాబాయ్‌ శివలాల్‌కు ఉద్వాసన

ఆదివారం, 23 అక్టోబరు 2016 (14:17 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన మంత్రివర్గంలో కేబినెట్ మంత్రిగా ఉన్న సొంత బాబాయి శివలాల్ యాదవ్‌తో పాటు మరో ముగ్గురు మంత్రులపై వేటువేశారు. వీరంతా ఎస్పీ అధినేత ములాయం సింగ్, అమర్ సింగ్‌లకు వీర విధేయులుగా ముద్రపడ్డారు. 
 
గత కొన్ని రోజులుగా సమాజ్‌వాదీ పార్టీలో నెలకొన్న అంతర్గత కలహాలు ఆ రాష్ట్ర రాజకీయాలను ఓ కుదుపు కుదుపుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సమాజ్ వాది పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనాయకులతో సీఎం అఖిలేష్ యాదవ్ ఆదివారం అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సుమారు 200 మంది ఎమ్మెల్యేలు హాజరైనట్టు సమాచారం. 
 
ఇందులో ఎస్పీ యూపీ రాష్ట్ర శాఖ పార్టీ అధ్యక్షుడు, వరుసకు బాబాయి అయిన శివపాల్ యాదవ్‌కతో పాటు మంత్రులు షబాబ్ ఫాతిమా, ఓం ప్రకాశ్, నారద్ రాయ్‌లను తన కేబినెట్ నుంచి తొలగించారు. అంతేకాకుండా, అమర్ సింగ్ అనుకూలురుగా ముద్రపడ్డ మరో నగులురు మంత్రులు, ప్రభుత్వ పదవులు నిర్వహిస్తున్నవారిపైనా వేటు తప్పదని అఖిలేష్ వర్గం ఆదివారం ప్రకటించింది. ఆదివారం నాటి పరిణామాలతో యాదవ్ పరివారంలో కొద్దిరోజులుగా సాగుతోన్న అంతర్గత కలహాలు పతాకస్థాయికి చేరినట్లయింది.
 
మరోవైపు.. ముఖ్యమంత్రి అఖిలేష్ సంచలన నిర్ణయంతో శివపాల్ వర్గం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. పార్టీ సుప్రిమో ములాయంను సంప్రదించకుండా అఖిలేష్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని ఊహించలేకపోయిన శివపాల్.. పరుగున అన్ని ఇంటికి బయలుదేరారు. మంత్రులను తొలగిస్తూ అఖిలేష్ తీసుకున్న నిర్ణయంపై ములాయం స్పందన వెలువడాల్సిఉంది. 

వెబ్దునియా పై చదవండి