అక్రమార్జన కేసులో సుప్రీం కోర్టు విధించిన రూ.10 కోట్ల జరిమానా చెల్లించమంటూ కర్ణాటక జైళ్ల శాఖ ఎప్పుడు లేఖ పంపుతుందా అని దివంగత జయలలిత సన్నిహితురాలు శశికళ, ఆమె వర్గీయులు ఎదురుచూస్తున్నారు. అక్రమార్జన కేసులో శశికళ ఆమె బంధువులు ఇళవరసి, సుధాకరన్‌లు బెంగళూరు పరప్పణ అగ్రహారంలో జైలుశిక్షను అనుభవిస్తున్నారు. వారు వచ్చే యేడాది ఫిబ్రవరి 14వ తేదీన విడుదల కావాల్సి వుంది.
అయితే శశికళను జైలు శిక్ష పూర్తవక ముందే విడుదల చేయించడానికి ఆమె తరఫు న్యాయవాది రాజా సెంధూర్ పాండ్యన్, అమ్మామక్కల్ మున్నేట్ర కళగం నాయకుడు టీటీవీ దినకరన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సుప్రీం కోర్టు న్యాయవాదులు, న్యాయనిపుణులతో సంప్రదింపులు కూడా జరుపుతున్నారు. జైలులో శశికళ సత్ప్రవర్తన కారణంగా అధికంగా పెరోలు ఉపయోగించకపోవడం ఆమె జైలు శిక్ష పూర్తవకముందే విడుదలవుతారని న్యాయవాది సెంధూర్‌పాండ్యన్ చెప్తున్నారు.
ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు శశికళకు విధించిన రూ.10 కోట్ల అపరాధాన్ని చెల్లించేందుకు నగదు కూడా సిద్ధం చేశారు. అయితే అపరాధం చెల్లించమంటూ ఇంతవరకూ కర్ణాటక జైళ్ల శాఖ నుంచి శశికళకు గానీ, ఆమె తరఫు న్యాయవాదికిగానీ ఎలాంటి లేఖ రాలేదు.
ప్రస్తుతం ఆ లేఖ ఎప్పుడు వస్తుందా అని శశికళ, ఆమె వర్గీయులంతా ఎదురుచూస్తున్నారు. దసరా సెలవుల తర్వాత కర్ణాటకలో కోర్టులన్నీ ప్రారంభమయ్యాయి. దీంతో నేడో రేపో జైళ్ల శాఖ అధికారులు శశికళను అపరాధపు సొమ్ము కోర్టులో చెల్లించమంటూ లేఖ పంపుతారని శశికళ, ఆమె వర్గం ఆశగా ఎదురు చూశారు.