శశికళకు గట్టి షాక్.. దినకరన్ ఇంట్లో ఈడీ సోదాలు.. జయమ్మ ఆశయాలు నెరవేరాలంటే?

శనివారం, 11 ఫిబ్రవరి 2017 (18:17 IST)
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు గట్టి షాక్ తగిలింది. సీఎం కుర్చీని దక్కించుకోవడం కోసం చిన్నమ్మ ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలో శశికళ మేనల్లుడు దినకర్‌ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. తమిళ రాజకీయాలు క్షణం క్షణం రసవత్తరంగా మారుతున్న నేపథ్యంలో ఈడీ సోదాలు నిర్వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది. దినకర్ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించడంపై శశికళ మద్దతుదారుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. 
 
గతంలో తమిళనాడు సీఎస్‌గా పనిచేసిన రామ్మోహన్ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో శశికళ మేనల్లుడు దినకర్ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించడంపై శశి వర్గంలో అసంతృప్తి నెలకొంది.
 
ఇదిలా ఉంటే.. గోల్డెన్‌ బే రిసార్ట్స్‌లో అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యేలతో శశికళ సమావేశం ముగిసింది. సుమారు గంటపాటు సమావేశమైన శశికళ పార్టీని కాపాడే సమయం ఆసన్నమైందని ఎమ్మెల్యేలకు ఉద్బోధించారు. పార్టీని కాపాడాలంటే కలిసికట్టుగా ఉండాలని వారికి సూచించారు. జయలలిత ఆశయాలు నెరవేరాలంటే అంతా ఐకమత్యంగా ఉండాలని, ప్రత్యర్థుల పన్నాగాలను తిప్పికొట్టాలని ఆమె ఎమ్మెల్యేలకు సూచించారు.

వెబ్దునియా పై చదవండి