ముఖ్యమంత్రి దివంగత జయలలిత అక్రమాస్తుల కేసులో సహనిందితురాలిగా ఉన్న శశికళ బెంగుళూరులోని పరప్పన అగ్రహార జైలులో శిక్షను అనుభవిస్తున్న విషయంతెల్సిందే. జైలులో ఉన్న ఆమెకు పదుల సంఖ్యలో ఉత్తరాలు వెళుతున్నాయి. ముఖ్యంగా గత ఫిబ్రవరి 15 మొదలు ఇప్పటివరకు 100 పైగా లేఖలు వచ్చాయి. ఈ లేఖలన్నీ 'శశికళ, సెంట్రల్ జైలు, పరప్పన అగ్రహార, బెంగళూరు 560100' అడ్రస్‌తో ఈ లేఖలు వస్తున్నాయి.
''మా తలైవిని, మాప్రియమైన అమ్మని చంపింది నువ్వే.. విశ్వాసఘాతకురాలివి, వెన్నుపోటుదారువి, నీకు కనీస కృతజ్ఞత లేదు... నీకు జీవితాన్ని, సర్వస్వాన్ని ఇచ్చిన వ్యక్తినే మోసం చేశావు.. గుర్తుపెట్టుకో, నువ్వు చేసిన నిర్వాకానికి అంతకంతకు అనుభవిస్తావు'' అని మచ్చుకు ఓ లేఖలోని సారాంశాన్ని జైలు వర్గాలు ఉటంకించాయి.
శశికళకు రాసిన ఉత్తరాలు ఇళవరసి చదివారని, అభ్యంతరంగా ఉన్న ఉత్తరాలను ఆమె చించేశారని జైలు అధికారులు చెపుతున్నారు. మొదట్లో శశికళ కూడా ఈ ఉత్తరాలు చదివేవారని, తర్వాత వాటిని చూడటం మానేశారట. తమిళనాడు రాజధాని చెన్నై నగరంతో సహ తిరుచ్చి, కరూర్, దిండిగల్, మదురై, ధర్మపురి, సేలం, కృష్ణగిరి తదితర ప్రాంతాల నుంచి ఈ ఉత్తరాలు వచ్చినట్టు జైలు అధికారులు అంటున్నారు.