ప్రజల మద్దతు ఉన్న వ్యక్తి మాత్రమే పార్టీని నడిపించాలన్నది అమ్మ(జయ) నిర్ణయమని, కానీ ప్రస్తుతం పార్టీలోని పరిస్థితులు అందుకు విరుద్ధంగా తయారయ్యాయని ఆరోపించిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అన్నాడీఎంకేను నిలువునా చీల్చేశారా? మెరీనా బీచ్‌లోని జయలలిత సమాధి వద్ద మంగళవారం గంటపాటు దీక్ష చేసిన అనంతరం ఓపీఎస్ మీడియాతో మాట్లాడిన పన్నీర్ సెల్వం.. సీఎంను అయిపోవాలనే ఆత్రుతతో వెనకూ ముందూ చూసుకోని శశికళపై, ఆమె మద్దతుదారులపై స్కడ్ బాంబ్ పేల్చారు. కనీస సమాచారం కూడా ఇవ్వకుండా తనను సీఎం పదవి నుంచి బలవంతంగా తొలిగించారని సెల్వం చేసిన ప్రకటన అన్నాడీఎంకేలో పెను చీలికకే నాంది పలికారు. దీంతో పరిణామాలు శరవేగంగా మారిపోయాయి.
శశికళపై పన్నీర్ సెల్వం తిరుగుబాటుతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు రోడ్లపైకి వచ్చి సంబరాలు జరుపుకొంటున్నారు. దీంతో అన్నాడీఎంకే నిట్టనిలువునా చీలినట్లైంది.పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళపై తీవ్రస్థాయి విమర్శలు చేసిన ఓపీఎస్‌కు ఎల్లడలా మద్దతు లభిస్తోంది. ఈ పరిణామాలతో ఇరుకున పడ్డ శశికళ.. అతివేగంగా పావులు కదుపుతున్నారు. మంగళవారం రాత్రి ఓపీఎస్ మీడియా సమావేశం ముగిసిన వెంటనే.. తన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఇతర నాయకులతో పోయెస్ గార్డెన్‌లో అత్యవసరంగా భేటీ అయ్యారు. పన్నీర్ సెల్వంకు, ఆయన చేసిన ఆరోపణలకు గట్టిగా బదులు చెప్పాలని శశికళ నిర్ణయించినట్లు తెలిసింది.
తాజా సమాచారం ప్రకారం కనీసం 50 మంది ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వంకు మద్దతు పలుకుతున్నారని ప్రముఖ చానెళ్లల్లో వార్తలు ప్రసారం అవుతున్నాయి. బుధవారం ఉదయం లేదా సాయంత్రానికి పన్నీర్‌ను బలపరిచే ఎమ్మెల్యేల సంఖ్య ఇంకా పెరగొచ్చని, వారి మద్దతుతో ఆయన తిరిగి ముఖ్యమంత్రి అవుతారని, ఆమేరకు జరిగే ప్రయత్నంలో బీజేపీ(కేంద్ర ప్రభుత్వం) కూడా దన్నుగా నిలుస్తుందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో శశికళ సీఎంగా ప్రమాణం చేసే అవకాశాలు దాదాపు సన్నగిల్లినట్లయింది.