ఎన్నికల బాండ్ల అంశంలో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ భారతీయ స్టేట్ బ్యాంకుకు సుప్రీంకోర్టు డెడ్‌లైన్ విధించింది. వివరాలన్నీ తప్పనిసరిగా వెల్లడించాల్సిందేనని రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. క్రమ సంఖ్యతో సహా చెప్పాల్సిందేనంటూ ఆదేశాలు జారీచేసింది. ఈ వివరాలన్నింటితో గురువారం సాయంత్రం ఐదు గంటల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం తేల్చి చెప్పింది. బ్యాంకు నుంచి వివాలన్నీ అందినవెంటనే వాటిని వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం స్పష్టంచేసింది.
ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అందజేసే విరాళాలపై ఎస్.బి.ఐ అందించిన అసంపూర్ణ డేటాపై దాఖలైన పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. బ్యాంకు ఆధీనంలో ఉన్న ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని బహిర్గతం చేయాలని తాము కోరుకుంటున్నట్టు జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. అంతేకాకుండా, తాము ఎలాంటి వివరాలను దాచిపెట్టలేదని స్పష్టం చేస్తూ గురువారం సాయంత్రం 5 గంటలలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఎస్.బి.ఐ ఛైర్మన్‌ను ధర్మాసనం ఆదేశించింది. బ్యాంకు నుంచి ఆ వివరాలు అందిన వెంటనే వాటిని వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.