విడిపోయిన దంపతులు మళ్లీ సహజీవనం చేయాలని, దాంపత్య జీవితాన్ని కొనసాగించాలంటూ ఆదేశించే అధికారాన్ని న్యాయస్థానాలకు కల్పించిన వైవాహిక చట్ట నిబంధనలను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో ప్రస్తావించిన అంశాలు ప్రాధాన్యం గలవి అని సుప్రీంకోర్టు పేర్కొంది.
పిటిషనర్లు లేవనెత్తిన విషయాలపై స్పందనను కేంద్ర ప్రభుత్వం పది రోజుల్లోగా లిఖితపూర్వంగా సమర్పించాలని కోరింది. ఈ కేసుకు సంబంధించి దాఖలైన వివిధ పిటిషన్లు అన్నింటినీ కలిపి విచారించేందుకు జస్టిస్ ఆర్.ఎఫ్.నారిమన్, జస్టిస్ కె.ఎం.జోసెఫ్, జస్టిస్ బి.ఆర్.గవాయ్‌ల ధర్మాసనం అనుమతించింది. తదుపరి విచారణను ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది.
హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 9, ప్రత్యేక వివాహ చట్టంలోని సెక్షన్ 22, ఇతర నిబంధనల రాజ్యాంగ చెల్లుబాటును సవాల్ చేస్తూ గుజరాత్ నేషనల్ లా యూనివర్శిటీకి చెందిన విద్యార్థులు ఓజశ్వా పాఠక్, మయాంక్ గుప్తా పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశంపై మరికొన్ని పిటిషన్లు కూడా న్యాయస్థానం ముందుకు వచ్చాయి.