సెల్ఫీలతో సమస్య పరిష్కరించడానికి ముగ్గురు యువకులు... ఏం చేస్తున్నారంటే?

మంగళవారం, 12 మార్చి 2019 (21:54 IST)
సెల్ఫీలు దిగడం ప్రస్తుతం ఫ్యాషన్‌గా మారింది. ఈ ప్రక్రియ కాస్త శ్రుతిమించి సమస్యలకు కూడా దారితీస్తోంది. అయితే నోయిడాలోని ముగ్గురు యువకులు ఈ సెల్ఫీని ఓ సమస్య పరిష్కారానికి ఉపయోగిస్తున్నారు. ఇందుకోసం వీధుల్లో తిరిగే ఆవులతో సెల్ఫీలు దిగుతున్నారు. అలా దిగిన సెల్ఫీలను ట్విట్టర్‌లో పోస్ట్ చేసి అధికారులను ట్యాగ్ చేస్తున్నారు. 
 
ఆవులు ఎక్కడ పడితే అక్కడ సంచరిస్తూ ఇబ్బందులను కలిగిస్తున్నాయి. ట్రాఫిక్‌కి అడ్డంకులు సృష్టిస్తున్నాయి. ఇలాగా రోడ్లలో కనిపించిన వాటిని వాజిద్‌పూర్‌లో కొత్తగా కట్టిన పశు సంరక్షణశాలకు తరలించి తమకు సమస్య నుంచి విముక్తి కలిగించాలని నోయిడా పౌరులు అధికారులను కోరుతున్నారు.
 
అమిత్ గుప్తా, అజయ్ పాండే, సచిన్ గోయల్ అనే ముగ్గురు యువకులు ఈ సెల్ఫీల ఉద్యమానికి సోమవారం శ్రీకారం చుట్టారు. మొదటిరోజు వారు తీసిన ఫోటోలను వాట్సాప్ ద్వారా ఇతరులకు పంపారు. అలాంటివి ఫోటోలు తీసి అధికారులను ట్యాగ్ చేసి మెసేజ్‌లు పెట్టాలని ఆ ముగ్గురూ పిలుపునిచ్చారు. 
 
ఏయే సెంటర్లలో ఆవుల సమస్య ఎక్కువగా ఉందో అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం ఈ సెల్ఫీ ఉద్యమం ముఖ్య ఉద్దేశం అని వారు పేర్కొన్నారు. గత జనవరిలో కేసర్ గార్డెన్స్ ఎదురుగా ఉండే యూటర్న్ వద్ద ఆవుల కారణంగా రెండు ప్రమాదాలు జరిగి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కొందరు పశువుల సెల్ఫీలను తీసి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కూడా ట్యాగ్ చేయడం విశేషం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు