ఈ వివరాలను పరిశీలిస్తే, యూపీలోని అమ్రోహా ప్రాంతానికి చెందిన షబ్నమ్ ఇంగ్లిష్‌లో ఎంఏ చేసింది. ఐదో తరగతి కూడా పాస్ కాని సలీం అనే యువకుడిని ప్రేమించి పెళ్లాడాలనుకుంది. ఇందుకు ఆమె కుటుంబ సభ్యులు నిరాకరించారు. దీనిని జీర్ణించుకోలేకపోయిన షబ్నమ్ ప్రియుడు సలీంతో కలిసి 2008లో తన కుటుంబంలోని ఏడుగురిని గొడ్డలితో నరికి చంపింది. ఇందులో ఆమె తల్లిదండ్రులతోపాటు సోదరులు, ఓ సోదరి కూడా ఉంది.
ఈ కేసులో షబ్నమ్, సలీంలను దోషులుగా తేల్చిన స్థానిక కోర్టు వారికి ఉరిశిక్ష విధించింది. దీంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, అక్కడా వారికి ఎదురుదెబ్బే తగిలింది. దీంతో చివరి ప్రయత్నంగా రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నారు. అక్కడ కూడా వారికి ఊరట లభించలేదు.
దీంతో షబ్నమ్‌తో పాటు సలీలను ఉరి తీసేందుకు జైలు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులోభాగంగా, షబ్నమ్‌ను ఉరితీయనున్న పవన్ జల్లాదే ఇప్పటికే రెండుసార్లు ఉరితీసే గదిని పరిశీలించారు. షబ్నమ్ ఉరి శిక్ష కనుక అమలైతే స్వతంత్ర భారతదేశంలో మహిళను ఉరి తీయడం ఇదే తొలిసారి అవుతుంది.
ఐదుగురు చిన్నారులను హత్య చేసిన కేసులో దోషులుగా తేలిన మహారాష్ట్రకు చెందిన అక్కాచెల్లెళ్లు సీమా గవిట్, రేణు షిండేలకు కూడా న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. ప్రస్తుతం యరవాడ జైలులో ఉన్న వారికి ఇంకా శిక్ష అమలు కాలేదు.