నేత చీర కట్టుకున్న స్రీ లా యూనివర్సిటీ పేపర్ లీకేజ్ చిత్రం: బ్రహ్మానందం

దేవీ

మంగళవారం, 19 ఆగస్టు 2025 (16:16 IST)
Brahmanandam, R Narayana Murthy,
ఆర్ నారాయణ మూర్తి యూనివర్సిటీ పేపర్ లీక్ సినిమా ఆగస్టు 22 న రిలీజ్ అవుతున్నది. ఈ సినిమాను కొందరు ప్రముఖులకు ఆయన చూపించారు. ఇంతకుముందు త్రివిక్రమ్ శ్రీనివాస్ చూసి మాట్లాడారు. నేడు హాస్య నటులు పద్మశ్రీ బ్రహ్మానందం సినిమా చూసి ఈ విధంగా స్పందించారు.
 
ప్రముఖ హాస్యనటులు పద్మశ్రీ బ్రహ్మానందం మాట్లాడుతూ: యూనివర్శిటీ అంటే ఏమిటి యూనివర్స్ అంటే విశ్వం . అంటే అన్ని గోళాల తోటి ఖగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి  భూమి లాంటి గ్రహమే కాకుండా విశ్వాంతరాళాలలోని గ్రహాలన్నింటికీ సంబంధించినటువంటి జ్ఞానాన్ని నేర్పేటటువంటిది ఆలయం. అదే విశ్వవిద్యాలయం అదే యూనివర్సిటీ. అటువంటి యూనివర్సిటీ ఇపుడు ఎటువంటి విశ్వవిద్యాలయాలు అయ్యాయి అని చెప్పడానికి ఎంతో ఎంతో కృషి చేసి అందులో  రీసెర్చ్ చేసి అందులో జరుగుతున్నటివంటి అవనీతిని… అప్పట్లో విశ్వవిద్యాలయాలు అంటే కాశీ విద్యాలయం అని పెద్ద పేరు బెనారస్ యూనివర్సిటీ. ఎక్కడెక్కడి నుంచో అన్ని దేశాల నుంచి మనదేశం వచ్చి చదువుకొనివెళ్లిపోయేవారు. అంటే అంత జ్ఞాన సంపద ఉన్న దేశం మనది.
 
ఈవాళ మన దేశం మన ఎడ్యుకేషనల్ స్థితి ఎలా వుంది విద్య వ్యవస్థలు ఎలా మరిపోతున్నాయి అని వాటి మీద అధ్యయనం చేసిన తమ్ముడు నారాయణమూర్తి అవన్నీ తట్టుకోలేక అంటే బ్రీత్ తీసుకోలేక దీన్ని నా మిత్రులకు నా వాళ్లకు ఎలాగైనా పంచి పెట్టాలి ఎందుకంటే నారాయణ మూర్తి తేనెటీగ లాంటి మనిషి.తిరుగుతూ ఉంటాడు తిరుగుతూ ఉంటాడు అన్ని చోట్ల తేనె పోగుచేసుకొని వచ్చి తలా ఒక చుక్క పంచిపెట్టాలి అనేటటువంటి మహా సంకల్పం ఉన్న మంచి మనిషి. 
 
మీకు అందమైన హీరో ఎవరు అని అడిగితే నేను నారాయణ మూర్తి పేరు చెపుతాను. అందం అంటే అది  గ్లామర్,6 ఫిట్స్ హైట్ కార్లింగ్ హెయిర్ అలాంటి  అందం కాదు. మదర్ థెరిస్సాని మీకు అందమైన వ్యక్తి ఎవరమ్మా మీకు అందంగా కనిపిస్తున్న వ్యక్తి ఎవరమ్మా అని అడిగితే ఎవరి మనస్సులో సేవా భావం వుంటుందో ఎవరి కళ్ళల్లో దయా గుణం వుంటుందో ఆవ్యక్తి, ఆ జీవి అందంగా వుంటుంది అని చెప్పింది. నలభై సంవత్సరాలనుండి నాకు తెలిసిన నారాయణ మూర్తి నిరంతరం ప్రజలు, ప్రజలు అందునా పేదవాళ్లు పేదవాళ్లు…వారు పడుతున్న కష్టాలు వారు పడుతున్న భాధలు… నటుడుగా నటించడం కాకుండా ఒక మెసేజ్ అనేది ప్రపంచానికి ఇవ్వాలి అనేటటువంటి వ్యక్తి నారాయణ మూర్తి. నేను థియేటర్ లో ప్రివ్యూ లు చూసి చాలాకాలం అయ్యింది. ఈ సినిమా ఎందుకు చూడాలి అనుకున్నాను అంటేదర్శకుడు వేరు నిర్మాతవేరు టెక్నీషియన్స్ వేరు. ఆ 24శాఖల పని అంతా అవన్నికూడా ఒక్కడే కాడి మోసి తాను చెప్పాలనుకున్నది అద్భుతంగా సినిమా తీసి చూపించాలనుకుంటాడు ఎందుకు అంటే అది మీకోసం ప్రజలకోసం పేద ప్రజలకోసం. 
 
ఈ సినిమా చూస్తున్నంతసేపు నాకు అనిపించింది ఇందులో అద్భుతమైన ఎమోషన్ వుంది. తండ్రి కొడుకు, తండ్రి కూతురు.. ఆ తండ్రి చదివించి చదివించి ఆ తండ్రి చేసిన త్యాగం, అలాగే ఆ కొడుకు తండ్రి కోసం చేసిన త్యాగం ఇలాంటి ఎమోషన్స్ అన్నిటినీ ఒకచోటకు తీసుకొచ్చి, ఎంత దారుణంగా హ్యూమన్ ఎమోషన్ తో ఈ సొసైటీ ఆడుకుంటుందో చెప్పే ప్రయత్నం నారాయణ మూర్తి చేశారు. అవినీతి బంధుప్రీతి అలుముకున్న చీకటి బజారు అలుముకున్న ఈదేశం ఎటు దిగజారు అన్నాడు శ్రీ శ్రీ. 50 ఏళ్ల కిందట మాట అది. దాన్ని ఈరోజు మాములు మనుషులకు కూడా అందుబాటులో ఉండాలి అని కష్టపడి కష్టపడి సినిమా తీసాడు తనకోసం కాదు మీకోసం. తన ఈ చొక్కా ఈ ప్యాంట్ అదే అతని జీవితం. అది మీకు అంకితం. అతని చివరి శ్వాస వరకు కష్టపడుతూనే వుంటాడు కష్టపడుతూనే వుంటాడు. వుండాలి అని నేను కోరుకుంటున్నాను. ఇది వాస్తవానికి దూరంగా ఉన్న సినిమా కాదు. ఇది ఊహించుకున్నటువంటి ఒక సుందరాంగి సినిమా కాదు. హాయిగా తలరా స్నానంచేసివచ్చి నేత చీర కట్టుకున్న  స్రీ లా ఉన్న సినిమా ఇది. 
 
ఒక అందమైన స్త్రి లా ఉన్న సినిమా. ఇందులో నిజాలుంటాయి వెతుక్కోండి ఇందులో బూతులు ఉండవు జీవితపు లోతులు వుంటాయి వెతుక్కోండి. బావిలో బ్యాలెట్ వేసి తీసుకోండి. ఇందులో కొన్ని డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి. డబ్బుకోసం సినిమా తీయకుండా నిజాయితీగా తను అనుకున్న దాని అద్భుతంగా తీసిన యూనివర్సిటీ సినిమా చూడండి. ఇలాంటి సినిమా అందరూ చూడాలి చూసి అర్థం చేసుకోండి. పిల్లలందరూ ఏసుక్రీస్తు సిలువను మోస్తున్నట్టు తమ పుస్తకాలను బరువు మోస్తున్నారు అంటూ వచ్చే సంభాషణలు అలాగే సమాజపు భారాన్ని తన భుజాన్ని వేసుకొని మోస్తున్న నారాయణ మూర్తి కున్న జిజ్ఞాస కి ఊతం ఇచ్చి ఆదరిస్తే ఇంకా ఎన్నో మంచి సినిమాలు తీస్తాడు. పేపర్ లీకేజ్ మాములు విషయం కాదు. డాక్టర్ వృత్తి రాదు వైద్యం చేస్తాడు. ప్రాజెక్ట్ కట్టడం రాదు ఇంజనీర్ అవుతాడు. ఈ దేశం ఎక్కడకు పోతుంది ఏమైపోతుంది? సమాజానికి తన వంతు సాయం తాను చేస్తున్నటువంటి వ్యక్తి నారాయణ మూర్తి. ఇలాంటి వారు వ్యక్తులు కాదు శక్తులు. గోదావరి భాషలో చెప్పాలి అంటే పులస చేపలాంటి వాళ్ళు. పులస చేప నదికి ఎదురు ఈదుతూ వుంటాది. అలాంటి ప్రత్యేక మనిషి. 
 
పేపర్ లీకేజ్ కి ఎంతోమంది బలి అయిపోయినవాళ్ళ గురించి అయిన చూడాల్సిన సినిమా ఇది. ఇలాంటి అద్భుతమైన సినిమాలు నారాయణమూర్తి మరిన్ని తీసి ప్రజల ఆశీర్వాదాలతో చిరస్థాయిగా ఉండాలి అని కోరుకుంటూ ఈ దేశాన్ని మళ్లీ బడిలో వెయ్యాలి. నారాయణ మూర్తి గారు చేసినటువంటి మంచి పనులు నేను చేయలేదు చేస్తానోకూడా తెలీదు. నిలువెత్తు మంచి మనిషి నారాయణ మూర్తి. ఒక సినిమా హిట్ అయితే మనం ఎలా ప్రవర్తిస్తున్నామో తెలుసు రెండు సినిమాల్లో ఆడితే ఎలా ప్రవర్తిస్తున్నామో తెలుసు ఒక దశాబ్ద కాలం సినిమాల్లో నటిస్తే ఎలా ప్రవర్తిస్తామో తెలుసు అలాంటిది నలభై సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఆయన్ని ఎవరు ఎన్ని రకాలుగా ప్రలోభ పెట్టినా కూడా నో చెప్పాడు. స్టార్స్ ని పెట్టి ఆయన సినిమాలు తియ్యలేదు. ఆరోజుల్లో నారాయణ మూర్తి గారి సినిమా అంటే జనాలు తండోపతండలుగా వచ్చేవారు ఇప్పుడు కూడా వస్తున్నారు.  నాకు వెంకటేశ్వరస్వామి అంటే ఇష్టం నారాయణమూర్తి అంటే ఇష్టం అని అన్నారు.
 
ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ: తెలుగు చలన చిత్ర పరిసరాల్లో ఒక కస్తూరి శివరావు గారు ఎరా చూసాము రమణారెడ్డి గారు రేలంగి గారి ఎరా చూసాము అల్లు రామలింగయ్య గారి ఎరా చూసాము పద్మనాభం, రాజబాబు గార్ల ఎరా చూసాము ఇపుడు బ్రహ్మానందం గారి ఎరా చూస్తున్నాము. ఆయన మహానటుడు మహా జ్ఞాని. అన్నింటిని మించి మాస్టరు. అందుకే నా పేపర్ లీకేజ్ సినిమా లోగోను ఆయనచే ఆవిష్కరింపచేసుకొని సినిమా రెడీ అయిన తరువాత ఆయనను కలసి ఈ సినిమా చూసి నాలుగు మాటలు చెప్పాలని విజ్ఞప్తి చేశాను. ఇంత బిజీలో కూడా యూనివర్సిటీ సినిమా చూసి నన్ను ఆశీర్వదించి నాపై ప్రేమను చూపిస్తున్న బ్రహ్మానందం గారికి మీ అందరి సమక్షంలో శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. యూనివర్సిటీ పేపర్ లీక్ సినిమా ఆగస్టు 22 న రిలీజ్ చేస్తున్నాను మీరు చూడండి ఏమాత్రం బాగున్నా ఆదరించండి మరిన్ని సినిమాలు తీసే శక్తిని ప్రసాదించండి అని అన్నారు
 
నటీనటులు - ఆర్. నారాయణ మూర్తి, వైఎస్ కృష్ణేశ్వర్ రావు, తిరుపతి నాయుడు, విజయ్ కుమార్ మరియు నూతన తారాగణం. 
 
పాటలు - గద్దర్ - జలదంకి సుధాకర్,  - వేల్పుల నారాయణ.-మోటపలుకులు రమేష్,
ఎడిటింగ్ - మాలిక్
కెమెరా - బాబూరావు దాస్
కథ-స్క్రీన్ ప్లే - మాటలు - సంగీతం - దర్శకత్వం - నిర్మాత
ఆర్. నారాయణ మూర్తి

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు