పాకిస్థాన్‌తో యుద్ధంపై సిద్ధరామయ్య కామెంట్స్ - రాజకీయ దుమారం.. క్లారిటీ ఇచ్చిన సీఎం

ఠాగూర్

ఆదివారం, 27 ఏప్రియల్ 2025 (17:21 IST)
పహల్గాంలో బైసరన్ లోయలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి 26 మంది హత్య చేశారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌‍తో యుద్ధం గురించి తాను చేసిన వ్యాఖ్యలపై కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వివరణ ఇచ్చారు. యుద్ధం ఎపుడు వచ్చినా మంచిది కాదని, అయితే, దేశ భద్రతను కావాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని అన్నారు. 
 
పహల్గాం దాడి తర్వాత పాకిస్థాన్‌తో యుద్ధం అవసరం లేదు అన్నట్టుగా తన వ్యాఖ్యలు ప్రచారంలోకి రావడంతో సిద్ధరామయ్య స్పందించారు. యుద్ధం అనివార్యం, అది పాకిస్థాన్‌తోనే జరగాలి అని నేను చెప్పాను. అసలు యుద్ధమే వద్దు అని నేను అనలేదు. వెంటనే యుద్ధానికి దిగవద్దు అని మాత్రమే చెప్పాను అని సిద్ధరామయ్య వివరణ ఇచ్చారు. 
 
పహల్గాం ఉగ్రదాడి వెనుక ఉన్న పాకిస్థాన్‌కు తగిన గుణపాఠం నేర్పేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఇందుకోసం అవసరమైతే యుద్ధం చేయాలని భావిస్తుంది. దీనిపై కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ, పాకిస్థాన్‌తో యుద్ధం వద్దంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. 
 
సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యలు పిల్ల చేష్టల మాదిరిగా ఉన్నాయన్నారు. దేశమంతా ఐక్యంగా ఉండాల్సిన తరుణంలో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆయన పదవికే అవమానకరమని, వెంటనే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని యడ్యూరప్ప డిమాండ్ చేశారు. 
 
అలాగే, బీజేపీ కర్నాటక శాఖ అధ్యక్షుడు విజయేంద్ర కూడా ఘాటుగా స్పందించారు. మైనార్టీల కోసమే సిద్ధరామయ్య ఈ తరహా వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. దేశ ప్రయోజనాలను దృష్ట్యా, ముఖ్యంగా, కాశ్మీర్ ఉగ్రదాడి నేపథ్యంలో సిద్ధరామయ్య వ్యాఖ్యలు పూర్తిగా అసంబద్ధమని, క్షమించరానివని అన్నారు. భారతదేశం ఎపుడూ యుద్ధాన్ని కోరుకోదన్నారు. కానీ, దేశాన్ని రక్షించుకోవాల్సి వస్తే వెనుకాడదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి తన వ్యాఖ్యలకు గాను దేశానికి క్షమాపణలు చేప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు