నాటుబాంబును కొరికిన చిన్నారి.. తినే వస్తువు అనుకుని..?

శనివారం, 13 జూన్ 2020 (10:55 IST)
తమిళనాడు తిరుచ్చిలో ఓ చిన్నారి నాటుబాంబును కొరికి ప్రాణాలు కోల్పోయాడు. తినే వస్తువు అనుకుని నాటుబాంబును కొరికాడు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.

వివరాల్లోకి వెళితే.. తిరుచ్చి జిల్లా తొట్టియమ్‌ సమీపంలోని అలగరై గ్రామానికి చెందిన గంగాధరన్‌ (31), తమిళ్‌ ఆరసన్‌ (28), మోహన్‌ రాజ్‌ (16) గురువారం పాపం పట్టి ప్రాంతంలో ఉన్న సెల్వకుమార్‌ (44) వద్ద మూడు నాటు బాంబులను కొనుగోలు చేశారు. వాటిని మణమేడు ప్రాంతంలో ఉన్న కావేరి నదిలో చేపలు పట్టేందుకు ఉపయోగించారు. 
 
పట్టిన చేపలను అలాగరైల్లో ఉన్న సహోదరుడు భూపతి ఇంటికి తీసుకుని వెళ్లారు. మిగిలిన ఓ నాటుబాంబుని అక్కడున్న మంచంపైన పెట్టి, ఇంటి వెనుక భాగంలో ఉన్న స్థలంలో చేపలను శుభ్రం చేయడానికి వెళ్లారు. ఇంతలో అక్కడికి వచ్చిన భూపతి కుమారుడు విష్ణుదేవ్ (6) మంచంపై ఉన్న నాటుబాంబుని తినే పదార్థం అనుకొని కొరికినట్టు తెలిసింది. 
 
ఆ నాటుబాంబు పేలడంతో విష్ణుదేవ్‌ తల చెల్లాచెదురైంది. బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం తెలపకుండా మృతదేహాన్ని శ్మశానవాటికలో దహనం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి విచారణ చేపట్టారు. అనంతరం పోలీసులు కేసు నమోదుచేసి గంగాధరన్, మోహన్‌జ్, సెల్వకుమార్‌ని అరెస్టు చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు