విద్య - ఉద్యోగ రంగాల్లో ఒకే.. ఎస్సీ - ఎస్టీ ఉప వర్గీకరణకు సుప్రీం ఓకే..!!

వరుణ్

గురువారం, 1 ఆగస్టు 2024 (14:55 IST)
విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల కల్పన కోసం ఎస్సీ, ఎస్టీ ఉపవర్గీకరణకు సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం కీలక తీర్పును వెలువరించింది. రిజర్వేషన్ల ఉపవర్గీకరణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందంటూ తన తీర్పులో స్పష్టం చేసింది. విద్య, ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ సమంజసమేనని తేల్చి చెప్పింది. 
 
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు లేదంటూ 2004లో ఇచ్చిన తీర్పును 'సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం గురువారం పక్కనబెట్టింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఉపవర్గీకరణ చేయకూడదంటూ ఇచ్చిన నాటి తీర్పును కొట్టివేసింది. ఈ మేరకు సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 6:1 మెజారిటీతో తీర్పు వెలువరించింది.
 
ఈ బెంచ్‌‍లో, ఉపవర్గీకరణ సాధ్యం కాదంటూ ఒక్క జస్టిస్ బేలా త్రివేది మాత్రమే అభ్యంతరం తెలిపారు. ఉపవర్గీకరణకు సీజేఐ చంద్రచూడ్‌తో పాటు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సతీశ్ చంద్ర, జస్టిస్ మనోజ్ మిశ్రా అనుకూలంగా తీర్పు ఇచ్చారు. సుప్రీం తీర్పును అనుసరించి రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై రాష్ట్రాలు మార్గదర్శకాలు రూపొందించుకోవాలని సుప్రీం ధర్మాసనం సూచించింది. ఆ మార్గదర్శకాలు సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఉండాలని నిర్దేశించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు