భారత ఆర్మీ మరోమారు తన ప్రతాపం చూపించింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ వెంబడి ఉన్న నియంత్రణ రేఖకు అత్యంత చేరువకు వెళ్లిన భారత సైన్యం అక్కడి నుంచే పాకిస్థాన్ సైన్యానికి చెందిన నాలుగు అతి ముఖ్యమైన స్థావరాలను ధ్వంసం చేసింది. పాక్ ఆర్మీకి పీవోకేలో ఉన్న ఒక కీలకమైన కార్యాలయాన్ని పూర్తిగా నేలమట్టం చేయగా, ఈ దాడుల్లో కనీసం 40 మంది పాక్ సైనికులు మరణించినట్లు సమాచారం. అయితే, దీనిపై అటు పాకిస్థాన్ గానీ, ఇటు భారత్ గానీ ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఈ దాడులు గత నెల 29వ తేదీన జరిగినట్టు తెలుస్తోంది. భారత జవాన్ మన్‌దీప్ సింగ్ తల వేరు చేసి దారుణంగా చంపేయడంపై రగిలిపోయిన భారత ఆర్మీ ఈ తాజా దాడులు జరిపింది. సెప్టెంబర్ నెలలో భారత సైన్యం పీవోకేలోకి ప్రవేశించి చేపట్టిన సర్జికల్ దాడి తర్వాత తీవ్ర ఒత్తిడికి గురైన పాక్ సైన్యం భారత సరిహద్దుల వెంబడి ఉన్న గ్రామాలపై కాల్పులకు తెగబడ్డాయి. మహిళలు, చిన్నారులు, అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లు పలువురు పౌరులు మృత్యువాత పడగా, మరికొంతమంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో భారత్ జరిపిన తాజా దాడులు పాక్ ఆర్మీలో కలకలం రేపాయి.