భారతీయులను చంపేసిన ఐసిస్ ఉగ్రవాదులు : సుష్మా స్వరాజ్

మంగళవారం, 20 మార్చి 2018 (12:35 IST)
ఐదేళ్ళ క్రితం ఇరాక్‌లో కిడ్నాప్ చేసిన 39 మంది భారతీయులను ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాదులు చంపేశారనీ భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ మంగళవారం లోక్‌సభలో వెల్లడించారు. ఇదే విషయంపై ఆమె మంగళవారం ఉదయం సభలో ఓ ప్రకటన చేశారు. 
 
ఈ 39 మందిని గత 2014లో వీరి కిడ్నాప్ జరిగిందని, వారిని గుర్తించేందుకు తామెంతో కృషి చేసి విఫలమైనట్టు తెలిపారు. మోసుల్‌లో వీరిని పూడ్చి పెట్టిన చోటును రాడార్ల సాయంతో కనుగొన్నామని, మృతదేహాలను బయటకు తీయగా, పూర్తిగా కుళ్లిపోయి ఉన్నాయని, మృతదేహాలను బాగ్దాద్‌కు తీసుకెళ్లి డీఎన్ఏ శాంపిల్స్‌ను పరీక్షించగా, 70 శాతం మ్యాచ్ అయ్యాయని తెలిపారు. 
 
ఆ అవశేషాలను స్వదేశానికి తీసుకొచ్చేందుకు జనరల్ వీకే సింగ్ ఇరాక్ వెళ్తున్నారని, ప్రత్యేక విమానంలో అవశేషాలను తీసుకు వస్తామన్నారు. ఆపై అవశేషాలను అమృత్‌సర్, పాట్నా, కోల్‍కతా ప్రాంతాల్లోని వారి కుటుంబీకులకు అప్పగిస్తామని తెలిపారు. కాగా, వీరంతా ఎక్కడో ఒకచోట బతికే ఉంటారని ఆశగా ఉన్న వారి కుటుంబాలను సుష్మా స్వరాజ్ ప్రకటన ఒక్కసారిగా విషాదంలో ముంచేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు