భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌ను చూసేందుకు పాకిస్థాన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. కులభూషణ్‌ను కలిసి తిరిగి అక్కడి నుంచి వచ్చే సమయంలో జాదవ్ భార్య ధరించిన బూట్లను పాకిస్థాన్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కానీ దీనిపై సర్వత్రా విమర్శలు చెలరేగడంతో, పాక్ ఓ కొత్తకథ చెప్పింది.
ఆ బూట్లలో లోహపదార్థం ఉన్నట్లు గుర్తించినట్లు వెల్లడించింది. జాదవ్ భార్య ధరించిన బూట్లలో గుర్తించిన లోహపదార్థం కెమెరా లేదా రికార్డింగ్ చిప్ అయి ఉంటుందని, ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించామని పాక్ విదేశాంగ ప్రతినిధి మహ్మద్ తెలిపారు.
జాదవ్ కుటుంబసభ్యుల్ని, అతన్ని చూడటానికి పంపే సమయంలో పాకిస్థాన్ ఇష్టానుసారంగా వ్యవహరించింది. ఆయన భార్య నుదుటిన బొట్టు చెరిపేసుకోవాలని, మంగళసూత్రం సైతం తీసేయాలని జాదవ్ భార్యను అధికారులు ఆదేశించారట. వారిద్దరి చెప్పులు బయటే విడిచి రావాలని, జాదవ్‌తో ఇంగ్లీష్ లోనే మాట్లాడాలని, ఎవరూ కూడా మాతృభాషలో మాట్లాడటానికి వీలు లేదని నిబంధనలు విధించారట.
ఈ విషయంపై విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ లోక్‌సభలో ప్రకటన కూడా చేశారు. కాగా, పాకిస్థాన్ తీరును వివరిస్తూ సుష్మస్వరాజ్ ఉద్వేగానికి గురై, కన్నీరు పెట్టుకున్నారు. భద్రతా కారణాలు అంటూ సాకులు చూపుతూ పాకిస్థాన్ క్రూరంగా ప్రవర్తించిందని తెలిపారు.
ఒకవేళ భద్రతా కారణాలే వారి ఉద్దేశం అయితే కుల్‌భూషన్ జాదవ్ తల్లి, భార్య చెప్పులు తీసుకున్న పాకిస్థాన్ వారు తిరిగి వెళ్లేటప్పుడు ఇచ్చేసి ఉండేదని, కానీ పాకిస్థాన్ అలా చేయలేదని వాపోయారు.