సీసీయూ నుంచి ప్రైవేట్ రూమ్‌కు జయలలిత.. త్వరలో డిశ్చార్జ్‌పై ప్రకటన.. పొన్నియన్

శుక్రవారం, 4 నవంబరు 2016 (13:48 IST)
తమిళనాడు సీఎం జయలలిత కోలుకున్నారు. ఆమె ఆరోగ్యం కుదుటపడింది. త్వరలో అమ్మను సీసీయూ నుంచి స్పెషల్ రూమ్‌కు మారుస్తారని అన్నాడీఎంకే సీనియర్ నేత.. ఆ పార్టీ అధికార ప్రతిని పొన్నియన్ వెల్లడించారు. అమ్మను సీసీయూ నుంచి ప్రైవేట్ రూమ్‌కి మార్చే ప్రక్రియ మూడు రోజుల్లోపు పూర్తవుతుందని చెప్పుకొచ్చారు. జయలలితకు ఊపిరితిత్తుల్లోని ఇన్ఫెక్షన్ అదుపులోకి వచ్చిందని, ఆమె క్లిష్ట పరిస్థితి నుంచి బయటపడ్డారని.. ఆమెకు ఫిజియోథెరపీ వైద్యులు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారని తెలిపారు.
 
అపోలో, ఎయిమ్స్, లండన్, సింగపూర్ వైద్యులు కలిసి వైద్యం చెయ్యడంతో జయలలిత సాధారణ స్థితికి వచ్చారని, వారందరికి పేరుపేరునా ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. శ్వాసకోశ వ్యవస్థ కూడా బాగుపడటంతో ఆమె అందరితో బాగానే మాట్లాడుతున్నారని.. గతవారం రోజులుగా జయలలితకు ఘన ఆహార పదార్థాలు ఇస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం జయలలిత అందరితో మాట్లాడుతున్నారని పొన్నియన్ అన్నారు. సీఎం జయలలితను ఎప్పుడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చెయ్యాలన్నది వైద్యులు నిర్ణయిస్తారని పొన్నియన్ తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి