కాంగ్రెస్, డీఎంకేలు రెండు కవలల పిల్లలులాంటివని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మదురైలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జయలలితపై విమర్శలు గుప్పించారు. ప్రజలకే కాదు కేంద్ర మంత్రులకు కూడా ఏమాత్రం అందుబాటులో లేకుండా నాలుగు గోడలకే పరిమితమయ్యే ముఖ్యమంత్రి మనకొద్దనీ ఆయన ఓటర్లకు పిలుపునిచ్చారు. జయలలిత నాలుగు గోడలకే పరిమితమయ్యేందుకు ఇష్టపడుతుంటే.. ప్రజలు కష్టాలు పడుతున్నారన్నారు.
కొద్దిరోజుల క్రితం చెన్నైని వరదలు ముంచెత్తినప్పుడు ఆమె బాధితులతో మాట్లాడేందుకు, వారి సమస్యలను తెలుసుకునేందుకు కూడా ఆసక్తి చూపలేదన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి అవసరమా అని ఆయన ప్రశ్నించారు. గత ఐదేళ్ళ కాలంలో రాష్ట్రంలో నిరుద్యోగం బాగా పెరిగిపోయిందన్నారు. అన్ని శాఖల్లో అవినీతి తారా స్థాయికి చేరుకోగా, పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలి వెళుతున్నాయని ఆరోపించారు.
చెన్నై మహానగరాన్ని వరదలు ముంచెత్తినప్పుడు బాధితులకు ఓదార్పునిచ్చేందుకు తాను ఢిల్లీ నుంచి చెన్నైకి వచ్చానని, కానీ.. చైన్నైలో ఉన్న సీఎం జయలలిత మాత్రం బాధితుల దగ్గరికి వెళ్లి పరామర్శించలేకపోయారని అన్నారు. పెరియార్ ఈవీ రామస్వామి, కామరాజ్, జీ రామచంద్రన్ వంటివారు కూడా ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను తెలుసుకునేవారని, కానీ జయలలిత మాత్రం అందుకు వ్యతిరేకమని ధ్వజమెత్తారు.