జాతీయ పార్టీలకు తమిళనాడులో స్థానంలేదు : డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం

గురువారం, 1 ఫిబ్రవరి 2018 (08:57 IST)
తమిళనాడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే సీనియర్ నేత ఓ.పన్నీర్ సెల్వం కేంద్రంలోని భారతీయ జనతా పార్టీకి తేరుకోలేని షాకిచ్చారు. తన రాజకీయ భవితవ్యాన్ని కాపాడుకునేందుకు నిన్నటివరకు బీజేపీ జాతీయ నేతలతో అంటకాగిన పన్నీర్ ఇపుడు రివర్స్ గేర్ వేశారు. 
 
'తమిళనాడులో జాతీయ పార్టీలకు స్థానం లేదు. 1967 నుంచీ రాష్ట్రంలో ద్రవిడ పార్టీలే అధికారంలో ఉన్నాయి. వంతులవారీగా తమిళనాడును ఏలుతున్నాయి. జాతీయ పార్టీలు నిలదొక్కుకోలేకపోయాయి. ఆ పార్టీలను ప్రజలు అంగీకరించరంటూ వ్యాఖ్యలు చేసి బీజేపీ నేతలకు తేరుకోలేని షాకిచ్చారు. 
 
ఎందుకంటే, వచ్చే యేడాది జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని పోటీ చేయాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. నిజానికి తమిళనాడు రాష్ట్రంలో బీజేపీకీ ఏమాత్రం పట్టులేదు. ఇటీవల జరిగిన చెన్నై, ఆర్కే.నగర్ ఉప ఎన్నికల్లో కూడా నోటా గుర్తు కంటే బీజేపీకి తక్కువ ఓట్లు పోలైన విషయం తెల్సిందే. 
 
ఈనేపథ్యంలో బీజేపీతో కలిసి ముందుకు సాగితే తమ భవితవ్యం కూడా ప్రమాదంలో పడుతుందని భావించిన పన్నీర్ సెల్వం తమ రాష్ట్రంలో జాతీయ పార్టీలకు స్థానం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు