తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పోలీస్ బాస్ (డీజీపీ)లకు ఆ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు చీవాట్లు పెట్టారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఏర్పాట్లు ఎవరిని సంప్రదించి చేశారంటూ మండిపడ్డారు. తన అనుమతి లేకుండా ఎందుకు చేయవలసి వచ్చిందని వారిద్దరిపై గవర్నర్ మండిపడ్డారు.
రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో గవర్నర్‌తో సీఎస్ గిరిజా వైద్యనాథన్, డీజీపీ రాజేంద్రన్, చెన్నై పోలీస్ కమిషనర్ జార్జ్‌లు గవర్నర్‌తో భేటీ అయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు రాజ్‌భవనకు వచ్చిన వీరు 50 నిముషాలకుపైగా గవర్నర్‌తో చర్చించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభం గురించి, మున్ముందు తీసుకోవాల్సిన చర్యలపై కూలంకషంగా చర్చించారు. తన అనుమతి లేకుండా, రాజ్‌భవన్ నుంచి ఎలాంటి ఆదేశాలు వెలువడకుండా శశికళ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఎందుకు ఏర్పాట్లు చేయాల్సి వచ్చిందని, ఎవరి ఆదేశాలతో ఇదంతా చేశారని వారిని గవర్నర్ నిలదీసినట్లు తెలిసింది.
సీఎంగా శశికళ ప్రమాణ స్వీకారం చేసేందుకు అనువుగా మెరీనాతీరంలో ఉన్న మద్రాసు విశ్వవిద్యాలయంలోని సెంటినరీ హాలును సిద్ధం చేసిన విషయం తెలిసిందే. లక్షలాది రూపాయలు ఖర్చు చేసి దీనిని సుందరీకరించారు. యుద్ధప్రాతిపదికన ఈ ఏర్పాట్లు చేపట్టారు. శశికళ ప్రమాణస్వీకారోత్సవానికి భారీగా జనం వచ్చే అవకాశముందన్న ఉద్దేశంతో మెరీనాతీరంలో అంతకు ముందు నుంచి ఉన్న 144 సెక్షన్‌ను కూడా ఎత్తేశారు. ఈ వ్యవహారాలపై గవర్నర్ నిలదీయడంతో ముగ్గురు అధికారులు నీళ్లు నమిలినట్లు సమాచారం.