సాధారణంగా పెళ్లి చేసుకున్న కొత్త జంట ముందుగా గుడికి లేదా మరొక ప్రాంతానికి వెళ్తారు. కానీ ఒక కొత్త జంట మాత్రం పెళ్లయిన వెంటనే కోర్టుకు వెళ్లారు. కోర్టుకు వెళ్లగానే రూ. 10,000 ఫైన్ కట్టాల్సి వచ్చింది. ఈ విచిత్ర సంఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. ఆ వివరాలేమిటో ఓసారి చూద్దాం.
ఇంట్లో వారికి తెలియకుండా ప్రేమించుకున్న ఓ జంట వివాహం చేసుకున్నారు. పెద్దలను కాదని పెళ్లి చేసుకోవడంతో వారు దాడి చేస్తారనే భయంతో కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ కొత్త జంట తాము పెళ్లాడిన ఫోటోలను కోర్టు వారికి సమర్పించారు. ఆ ఫోటోలను పరిశీలించిన కోర్టు, వారికి రూ. 10,000 ఫైన్ విధించింది. ఫైన్ ఎందుకు వేసారో తెలిస్తే మీరు ఒక్కసారిగా షాక్‌కి గురవుతారు.
కొత్త జంట పెళ్లి చేసుకునే సమయంలో ఎలాంటి మాస్క్‌లను ధరించలేదు. మాస్క్ లేకుండా బయటకు రాకూడదని ప్రభుత్వాలు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసాయి. ఒకవేళ మాస్క్ ధరించకుండా అలాగే బయటకు వస్తే భారీగా ఫైన్ విధిస్తామని కూడా ప్రకటించాయి. ఈ కొత్త జంట పెళ్లి సందట్లో పడిపోయి మాస్క్ ధరించడం మరచిపోయారు. అందుకు ఆ జంటకు రూ. 10,000 ఫైన్ వేసారు. ఈ ఫైన్‌ను 15 రోజులలోపు చెల్లించాలని, అలాగే డిపాజిట్ చేసిన డబ్బును మాస్క్‌ల తయారీ కోసం వినియోగించాలని కోరారు.