మనిషిని చూస్తే పులి ఊరుకుంటుందా? ఏ జంతువుని చూసినా క్రూర మృగమైన పులి ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టదు. అలాంటిది ఓ తాగుబోతును చూసి, అతడి తనకు దగ్గరగా వచ్చి పట్టుకున్నా కూడా ఏమాత్రం అతడిపై దాడి చేయకుండా తనదారిన తను వెళ్లిపోయింది. పూర్తి వివరాలు చూస్తే... మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజు పటేల్ అనే వ్యక్తి పూటుగా మద్యం సేవించి చేతిలో మద్యం బాటిల్ తీసుకుని తెల్లవారు జామున 3 గంటలకు రోడ్డుపై తూలుతూ తూగుతూ నడుస్తూ వస్తున్నాడు.
ఆ సమయంలో అతడికి ఎదురుగా రోడ్డుపై పెద్దపులి ఎదురైంది. దాన్ని చూసిన రాజు అదే పెద్ద సైజులో వున్న పిల్లి అనుకుని దాని తలపై చేయిపెట్టి నిమురుతూ మద్యం సీసాలో వున్న బీర్ ను తాగించే ప్రయత్నం చేసాడు. ఐతే పెద్దపులి ఒక్క గుటక కూడా వేయలేదు. తనదారిన తను వెళ్లిపోయింది. ఈ ఘటన జరిగింది అక్టోబర్ 4న. పెంచ్ నేషనల్ పార్క్ అధికారులు తమ సీసీ కెమేరాలను పరిశీలిస్తున్నప్పుడు ఇది వెలుగులోకి వచ్చింది.
ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఎవరికి తోచిన కామెంట్లు వారు చేస్తున్నారు. ఈ తాగుబోతుని చంపి తినడం కంటే వేరే దరిద్రం లేదని ఆ పులి వెళ్లిపోయి వుంటుందని ఒకరు కామెంట్ చేస్తే... మత్తులో వున్నవాడితో మనకెందుకులే, టచ్ చేస్తే మనమే చస్తాం అనుకుని వెళ్లిపోయి వుంటుందని కామెంట్ చేసాడు. ఐతే ఇది AI వీడియో అంటూ చాలామంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.