జమ్మూకాశ్మీర్ ముమ్మాటికీ భారత్‌లో అంతర్భాగమని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. కాశ్మీర్ వేర్పాటువాదులతో చర్చలు జరిపేందుకు అఖిల క్ష బృందాన్ని ఆయన తీసుకెళ్లారు. అయితే, అఖిలపక్షంతో చర్చలు జరిపేందుకు కాశ్మీర్ వేర్పాటువాద నేతలు తిరస్కరించారు.
జమ్మూకాశ్మీర్ పరిస్థితిపై ప్రభుత్వం ఆందోళన చెందుతోందని, కశ్మీర్‌లో పరిస్థితిని మెరుగుపరచాలనే అభిప్రాయంతోనే తామంతా ఉన్నామని చెప్పారు. కాశ్మీర్ ప్రజలపై, మానవత్వంపై తమకు నమ్మకం లేదని వేర్పాటువాదులు అంటున్నారని పేర్కొన్నారు.
'ఒకరు మాట్లాడుతున్నప్పుడు అవతలివారు (వేర్పాటువాదులు) మాట్లాడకపోతే వారికి మానవత్వం మీద కానీ, కాశ్మీరియత్ మీద కానీ నమ్మకం లేనట్టే' అని ఆయన అన్నారు. కాశ్మీర్‌పై చర్చల కోసం తమ తలుపులే కాకుండా హృదయాలు కూడా తెరిచి ఉంచామని ఆయన వ్యాఖ్యానించారు. కాశ్మీర్‌లో తిరిగి సాధారణ పరిస్థితి నెలకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి తాము సంపూర్ణంగా సహకరిస్తామని చెప్పారు.