సాధారణంగా వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. దీంతో ప్రజలు ఉక్కపోత, ఎండ వేడిమికి తల్లడిల్లిపోతుంటారు. ఇక స్కూల్ విద్యార్థులు అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, ఢిల్లీలో మాత్రం ప్రత్యేక పరిస్థితులు నెలకొంటాయి. ఎండవేడిమి, వడగాల్పులు, ఉక్కపోత కారణంగా ప్రజలు సతమతమవుతుంటారు.
ఢిల్లీలో ఎండల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నడివేసవిలో 45 డిగ్రీలకు పైగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో తమ కాలేజీలోని తరగతి గదులు చల్లగా ఉండేందుకు ఢిల్లీ యూనివర్శిటికీ చెందిన లక్ష్మీభాయి కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రత్యూష్ వత్సల చేసిన వినూత్న పనికి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు.
తమ కాలేజీలోని తరగతి గదులు చల్లగా ఉండేందుకు ఆవుపేడను స్వయంగా క్లాస్ రూమ్ గోడలన్నింటికీ పూశారు. ఇలా చేయడం వల్ల గోడలు వేడిని నిరోధించి చల్లదనాన్ని ఇస్తాయని తెలిపారు. వేసవిలో గదులను కూల్‌గా ఉంచేందుకు పరిశోధనలో భాగంగా ఈ విధంగా ఆవుపేడ పూశామని, మరో వారం రోజుల్లో పరిశోధన వివరాలను తెలియజేస్తామని ప్రిన్సిపాల్ వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.