నక్సలైట్లను కాటేస్తున్న కరోనా : బస్తర్ అడవుల్లో 10 మంది మృతి

మంగళవారం, 11 మే 2021 (20:39 IST)
దట్టమైన అడవుల్లో తలదాచుకునే నక్సలైట్లను కూడా కరోనా వైరస్ కాటేస్తోంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బస్తర్ అడవుల్లో ఉండే మావోయిస్టుల్లో అనేక మంది కరోనా వైరస్ సోకి ప్రాణాలు కోల్పోతున్నట్టు సమాచారం. ముఖ్యంగా, ద‌క్ష‌ణి బ‌స్త‌ర్ అడవుల్లో కరోనా సోకి 10 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందిన‌ట్లు దంతెవాడ ఎస్పీ అభిషేక్ ప‌ల్ల‌వ వెల్ల‌డించారు. 
 
అలాగే, మరో 100 మందికి పైగా మావోయిస్టులు క‌రోనా బారిన ప‌డిన‌ట్లు త‌మ‌కు స‌మాచారం ఉంద‌ని ఆయ‌న తెలిపారు. క‌రోనా సోక‌డం, క‌లుషిత ఆహారం తిన‌డంతో మావోయిస్టులు చ‌నిపోయిన‌ట్లు తెలుస్తుందని తెలిపారు. క‌రోనాతో చ‌నిపోయిన వారిలో మావోయిస్టు అగ్ర‌నేత‌లు ఉన్న‌ట్లు స‌మాచారం. అయితే మృతి చెందిన మావోయిస్టుల పేర్లు వెల్ల‌డి కాలేదు. 
 
క‌రోనా సోకిన వారిలో మోస్ట్ వాంటెడ్ మహిళ మావోయిస్టు సుజాత (25 లక్షల రూపాయల రివార్డ్)తో పాటు 10 లక్షల రూపాయల రివార్డులు కలిగిన మావోయిస్టులు జయలాల్, దినేష్‌ ఉన్నట్టు సమాచారం. కొవిడ్‌తో బాధపడుతున్న మావోలు జనజీవన స్రవంతిలోకి వచ్చినట్లయితే వారందరికీ ప్రభుత్వం తరపున మంచి వైద్యం అందిస్తామని దంతెవాడ ఎస్పీ అభిషేక్ ప‌ల్ల‌వ‌ హామీ ఇచ్చారు.
 
మరోవైపు, కరోనా వైరస్ సోకిన తమ అనుచరులను రక్షించేందుకు మావోయిస్టులు సమీప గ్రామాల్లోకి వచ్చి కరోనా మందులు దొంగిలించి తీసుకెళుతున్నారు. అలాగే, కొందరు గ్రామ ప్రజలు కూడా మావోయిస్టులకు కరోనా మందులను చేరవేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు