ప్రముఖ ప్రర్యాటక ప్రాంతమైన గోవాలో కరోనా వైరస్ కమ్మేసింది. అనేక మంది ఈ వైరస్ కోరల్లో చిక్కుతున్నారు. దీంతో గోవాలోని ప్రభుత్వ ఆస్పత్రులన్నీ రోగులతో నిండిపోయాయి. ఈ క్రమంలో గోవా మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో మంగళవారం తెల్లవారుజామున 2 గంటల నుంచి 6 గంటల మధ్యలో 26 మంది కరోనా రోగులు ప్రాణాలు విడిచారు.
ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి విశ్వజిత్ రాణే హైకోర్టుకు తెలిపారు. అయితే కరోనా రోగులు మరణించడానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత లేనప్పటికీ, రోగులు చనిపోవడానికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు. సోమవారం 1200 జంబో సిలిండర్ల ఆక్సిజన్ అవసరమైనప్పటికీ 400 మాత్రమే సరఫరా చేశారని తెలిపారు.
ఇక గోవా మెడికల్ కాలేజీలో వార్డుల వారీగా ఆక్సిజన్‌ను అందించే మెకానిజమ్‌పై చర్చిస్తామని సీఎం తెలిపారు. గోవా మెడికల్ కాలేజీ ఆస్పత్రిని సీఎం ప్రమోద్ సావంత్ మంగళవారం సందర్శించి, కరోనా రోగులకు అందుతున్న సేవలను దగ్గరుండి పరిశీలించారు. వైద్య సేవలు ఎలా ఉన్నాయని రోగులను అడిగి తెలుసుకున్నారు.
మరోవైపు, కోవిడ్ రోగుల చికిత్సకు ఇవర్‌మెక్టిన్ ఉపయోగించేందుకు అగ్రరాజ్యం అమెరికా నిరాకరించింది. కానీ, మన దేశంలో గోవా ప్రభుత్వం అనుమతిచ్చింది. అమెరికా ఆహార, ఔషధ సంస్థ (ఎఫ్‌డీఏ) ఈ మందును తిరస్కరించింది. ఇవర్‌మెక్టిన్ పూర్తిగా ఇన్‌ఫెక్షన్‌ను తొలగించదని, అయితే జబ్బు తీవ్రతను అది తగ్గిస్తుందని గోవా ప్రజారోగ్య శాఖామంత్రి విశ్వజిత్ పీ రాణే ఫేస్‌బుక్ పోస్టులో తెలిపారు. రోగికి ఐదు రోజులపాటు ప్రతిరోజూ 12 మి.గ్రా. మందును ఇస్తారని ఆయన వివరించారు.
మరణాల రేటును, కోలుకునే సమయాన్ని తగ్గించడం, వైరస్‌ను లేకుండా చేయడం ఇవర్‌మెక్టిన్ చికిత్స వల్ల కలిగే ప్రయోజనాలని, యూకే, ఇటలీ, స్పెయిన్, జపాన్ నిపుణుల బృందాలు తేల్చిచెప్పాయని రాణే పేర్కొన్నారు. అయితే ఈ మందుతో ఏదో ఙభరోసా లభించినట్టు భావించరాదని, దీంతోపాటే మిగతా చికిత్సలూ కొనసాగించాలని స్పష్టం చేశారు.