భగ్గుమన్న దేశ రాజధాని : అగ్రి బిల్లులకు వ్యతిరేకంగా ఉత్తరాదిలో నిరసనలు

సోమవారం, 28 సెప్టెంబరు 2020 (14:06 IST)
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఉత్తరభారతంలో ఆందోళనలు తారా స్థాయికి చేరాయి. ముఖ్యగా, పంజాబ్‌, హర్యానాతో పాటు రాజస్థాన్‌, ఉత్తర ప్రదేశ్‌లోనూ రైతులు ఆందోళనకు దిగారు. తాజాగా ఈ నిరసనల సెగ దేశ రాజధాని ఢిల్లీని తాకింది. 
 
కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని పెద్ద ఎత్తున రైతులు ఇండియా గేట్‌ వద్దకు చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతేకాకుండా వ్యవసాయ బిల్లును నిరసిస్తూ ట్రాక్టర్‌ను దగ్ధం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ దిష్టి బొమ్మను సైతం తగులబెట్టారు. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 
 
ఇండియా గేట్ వద్ద పంజాబ్‌ యూత్‌ కాం‍గ్రెస్‌ ఆధ్వరంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. పోలీసులు వారిని అడ్డుకున్నా ఇండియా గేట్‌ ముందు కూర్చుని ధర్నా నిర్వహించారు. మరోవైపు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్‌లో రైతుల ఆందోళనలు ఆదివారం కూడా కొనసాగాయి. అమృత్‌సర్ - ఢిల్లీ మార్గంలో రైలు పట్టాలపై కూర్చుని నిరసన తెలిపారు. 
 
ఓ వైపు దేశ వ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగసిపడుతున్నా.. రైతుల ఆందోళనలకు కారణమైన వ్యవసాయ బిల్లులు చట్టరూపం దాల్చాయి. అవి.. రైతు ఉత్పత్తుల వాణిజ్యం, వ్యాపారం (ప్రోత్సాహం, వసతుల కల్పన) బిల్లు - 2020, రైతు(సాధికారత, రక్షణ) ధరల హామీ, వ్యవసాయ సేవల బిల్లు-2020, నిత్యావసరాల(సవరణ) బిల్లు-2020లకు రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ ఆమోదముద్రవేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు