నేడు మమత సారథ్యంలో ఢిల్లీలో భేటీ - సీఎం కేసీఆర్ దూరం దూరం

బుధవారం, 15 జూన్ 2022 (08:21 IST)
రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దించే విషయంపై చర్చించేందుకు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సారథ్యంలో ఢిల్లీలో విపక్ష పార్టీల కీలక సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి దూరంగా ఉండాలని తెరాస అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. 
 
మరోవైపు, ఈ భేటీ కోసం మమతా బెనర్జీ మంగళవారమే హస్తినకు చేరుకున్నారు. పైగా, ఆమె తన నివాసానికి వెళ్లడానికి ముందుగానే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఇంటికి వెళ్లి ఆయనతో మాట్లాడారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ఆయన్ను ఒప్పించేందుకు మమతా బెనర్జీ ప్రయత్నించినట్టు సమాచారం. అయితే, విపక్షాలకు ఎలక్ట్రోరల్ కాలేజీలో ఉన్న ఓట్ల శాతాన్ని పరిగణనలోకి తీసుకున్న శరద్ పవార్ పోటీకి నిరాకరించారు. పైగా, తాను రాష్ట్రపతి అభ్యర్థి రేసులో లేనని స్వయంగా ప్రకటించారు. 
 
ఇదిలావుంటే, ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి సహా 8 మంది సీఎంలు, 22 మంది వివిధ పార్టీల నేతలకు మమత లేఖలు రాశారు. అయితే, కాంగ్రెస్‌ను ఆహ్వానిస్తే తాము వచ్చేది లేదని ఇటీవలే తేల్చి చెప్పిన టీఆర్ఎస్.. అనుకున్నట్టే ఈ సమావేశానికి డుమ్మా కొడుతోంది. 
 
సమాశానికి హాజరు కావాలా? వద్దా? అన్న విషయమై పార్టీ నేతలతో చర్చించిన కేసీఆర్..  చివరికి వెళ్లకూడదనే నిర్ణయం తీసుకున్నారు. కాగా, రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌కు తాము సమదూరం పాటిస్తామని, తమ వైఖరేంటో తర్వాత ప్రకటిస్తామని టీఆర్ఎస్ తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు