రాజ్యసభ ఎంపీ, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నాయకుడు అశోక్ మిట్టల్ గురువారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పైన నిప్పులు చెరిగారు. 146 కోట్ల మంది భారతీయులు అమెరికా కంపెనీలను బహిష్కరిస్తే ఏమవుతుందో తెలుసా ట్రంప్ అంటూ ఆయనకు ఒక పదునైన బహిరంగ లేఖ రాశారు. రష్యా చమురు దిగుమతుల నేపధ్యంలో భారతదేశంపై ఇటీవల 50% సుంకాలు విధించడాన్ని ఖండిస్తూ, వాణిజ్య చర్యలు కొనసాగితే తీవ్ర ఆర్థిక పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
అశోక్ మిట్టల్, ట్విట్టర్ X వేదికగా పంచుకున్న తన లేఖలో ట్రంప్ సుంకాల నిర్ణయాన్ని తూర్పారబట్టారు. అందులో ఆయన... సుదీర్ఘ వ్యూహాత్మక, విలువల ఆధారిత భాగస్వామ్యం కలిగిన రెండు దేశాలకు ట్రంప్ నిర్ణయం తీవ్రంగా నిరాశపరిచింది అని పేర్కొన్నారు. ఆగస్టు 7, 1905న ప్రారంభించబడిన స్వదేశీ ఉద్యమం యొక్క స్ఫూర్తిని ప్రేరేపిస్తూ, భారతదేశం అమెరికా వ్యాపారాలను పరిమితం చేయడం ద్వారా ప్రతీకారం తీర్చుకోగలదని ఆయన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను హెచ్చరించారు.
146 కోట్ల మంది భారతీయులు నేడు స్వదేశీ ఉద్యమం యొక్క స్ఫూర్తితో అమెరికా వ్యాపారాలపై వ్యూహాత్మక పరిమితిని ప్రారంభిస్తే, దాని ప్రభావం భారతదేశం కంటే అమెరికాపై చాలా తీవ్రంగా ఉంటుందని లేఖలో పేర్కొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను చనిపోయిన ఆర్థిక వ్యవస్థ అని ట్రంప్ ఇటీవల చేసిన విమర్శలకు AAP నాయకుడు ప్రతిగా స్పందిస్తూ, భారతదేశానిది చనిపోయిన ఆర్థిక వ్యవస్థ అని మీరు అన్నారు. అయినప్పటికీ ఈ చనిపోయిన ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 4వ అతిపెద్దదైంది. త్వరలో మూడవ స్థానానికి చేరుకుంటుంది, ప్రధాన దేశాలలో వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. భారతదేశం నుంచి అమెరికా పొందుతున్న ప్రయోజనాలను ట్రంప్ మరిచిపోయినట్లున్నారంటూ మండిపడ్డారు.