గెలిచాక బుద్ధిచూపిన దినకరన్ ... అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన స్థానిక నేతలు

బుధవారం, 27 డిశెంబరు 2017 (10:55 IST)
ఆర్కే.నగర్ ఉపఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన అన్నాడీఎంకే అసమ్మతి నేత టీటీవీ దినకరన్ విజయం సాధించారు. అయితే, ఈయన గెలుపునకు దినకరన్ ఇచ్చిన ఓటుకు నోటు హామీనే ప్రధాన కారణమనే ప్రచారం జోరుగా సాగుతోంది. 
 
అయితే, దినకరన్ గెలుపునకు దారితీసిన కారణాలు ఎలా ఉన్నప్పటికీ, ఓటుకు రూ.10 వేల వరకూ దినకరన్ వర్గం ఆఫర్ చేసినట్టు ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి. అయితే, గతంలోలా నేరుగా డబ్బులివ్వకుండా, రూ.20 నోట్లపై కోడ్ రాసి, వాటిపై ఓటరు సంఖ్య నంబరేసి, వాటిని ఓటర్లకు పంచినట్టు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలు వచ్చాక, ఆ కోడ్ రాసిన నోట్ చూపితే మొత్తం డబ్బు చెల్లిస్తామని హామీ ఇచ్చారట. దీంతో ఆర్.కె. నగర్ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివెళ్లి ఓట్లు వేశారు. 
 
అయితే, ఇపుడు రూ.20 నోటును తీసుకెళ్లి స్థానిక నేతలను డబ్బులు అడగ్గా వారు ముఖం చాటేస్తున్నారు. మరికొందరు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే పలుచోట్ల గొడవలు కూడా జరిగాయి. దీంతో నలుగురు దినకరన్ అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్నికలకు ముందు రూ.20 నోటిచ్చి, తాము గెలవగానే రూ.10 వేలు ఇస్తామని దినకరన్ మనుషులు తమ వద్దకు వచ్చారని పలువురు వ్యాఖ్యానించారు. 
 
రూ.20 నోట్ల పంపకం సజావుగా సాగగా, ఇప్పుడు ప్రతి ఒక్కరూ వచ్చి స్థానికంగా ఉన్న నేతలను ఓటర్లు నిలదీస్తున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక పాలుపోని స్థితిలో ఉన్న స్థానిక నేతలు, ఫోన్లు స్విచ్చాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని ఆర్కే.నగర్ ఓటర్లు ఆరోపిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు