ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో శనివారం ఉదయం జంట పేలుళ్లు సంభవించాయి. ప్రఖ్యాత పర్యాటక స్థలం తాజ్‌మహాల్‌ను ఇటీవల పేల్చి వేస్తామని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు హెచ్చరించారు. దీంతో ఆ ప్రాంతమంతా గట్టి నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో ఆగ్రా కంటోన్మెంట్ రైల్వే స్టేషన్‌లో శనివారం ఉదయం రెండు జంట పేలుళ్లు చోటుచేసుకున్నాయి.
తొలుత ఓ రైల్వే ట్రాక్ సమీపంలోని చెత్తకుండీ వద్ద పేలుడు చోటుచేసుకోగా.. ఆ తర్వాత సమీపంలోని అశోక్ అనే వ్యక్తి ఇంటి పైకప్పుపై పేలుడు సంభవించింది. అంతేకాకుండా రైల్వేట్రాక్ వద్ద ఓ బెదిరింపు లేఖ కూడా లభ్యం అయింది. అయితే, ఇవి తక్కువ తీవ్రత కలిగిన బాంబులు కావడంతో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు. పేలుళ్లకు గల కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.