రైలులో సీటు కోసం మహిళా ప్రయాణికుల సిగపట్లు : వీడియో వైరల్

శుక్రవారం, 7 అక్టోబరు 2022 (15:56 IST)
సాధారణంగా వీధుల్లో నీళ్లు పట్టుకునే సమయంలో, బస్సులో సీట్ల కోసం మహిళలు తన్నుకోవడం చూస్తుంటాం. ఇక్కడ రైలులో సీటు కోసం కొందరు మహిళలు జుట్లు పట్టుకుని తన్నుకున్నారు. దీంతో ఓ మహిళ తలకు బలమైన గాయం తగిలింది. ఈ ఘటన ముంబై సబర్బన్ రైలులో జరిగింది. దీన్ని ఎవరో మొబైల్‌లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది. ఈ వివరాలను పరిశీలిస్తే, మహారాష్ట్రలోని థానే నుంచి పన్వేల్ వెళుతున్న ఓ సబర్బన్ రైలులో సీటు కోసం ముగ్గురు మహిళల మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. ఇది కాస్త ఘర్షణకు దారితీసింది. జట్టు పట్టుకుని వాళ్లు కొట్టుకుంటున్నారు. వీరిలో చదువుకున్న మహిళలే ఉండటం గమనార్హం. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, తలోజా నివాసి గుల్నాథ్ జుబారే ఖాన్, ఆమె కుమార్తె అంజుఖాన్, ఆమె పదేళ్ళ మనుమరాలు రాత్రి 7.30 గంటల సయమంలో థానేలో రైలు ఎక్కారు. కోపర్‌ఖైరానే వద్ద రైలు ఆగింది. ఈ స్టేషన్‌లో ఎక్కిన స్నేహాదేవే తుర్పే అనే మహిళ ఖాళీగా ఉన్న సీటులో కూర్చొన్నారు. ఈ సీటులో పదేళ్ల చిన్నారిని కూర్చోనివ్వకుండా సీటు లాక్కున్నారని ఆరోపిస్తూ జుబారే ఖాన్, అంజూఖాన్‌లు కలిసి స్నేహాదవేతో వాగ్వాదానికి దిగారు. 
 
తొలుత చిన్నపాటి మాటలతో మొదలైన ఈ చిన్న గొడవ ఆ తర్వాత చిలికిచిలికి గాలివానలా తయారైంది. ఈ ముగ్గురు మహిళలు తగ్గేదేలే అన్నట్టుగా సిగపట్లు పట్టుకున్నారు. ఒకరి జుట్లు ఒకరు పట్టుకుని చితకబాదుకున్నారు. దీంతో ఓ మహిళకు రక్తపుగాయమైంది. చివరకు రైలు నేరుల్ స్టేషన్‌కు చేరుకోగానే ఎవరో రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. 
 
ఆ వెంటనే శారదా ఉగ్లే అనే మహిళా కానిస్టేబుల్ వచ్చి ఈ ముగ్గురిని మందలించారు. దీంతో వారంతా శాంతించినట్టు కనిపించారు. ఇంతలో ఏమైందో ఏమోగానీ మళ్లీ ముగ్గురు గొడవపడ్డారు. ఈ క్రమంలో కొందరి తోటి ప్రయాణికులకు గాయాలయ్యాయి. గొడవను ఆపేందుకు ప్రయత్నించిన మహిళా కానిస్టేబుల్‌కు కూడా గాయాలయ్యాయి. దీంతో తల్లీ కుమార్తెలపై ఐపీసీ 353 సెక్షన్ కింద కేసు నమోదు చేసి అంజూఖాన్‌ను అరెస్టు చేశారు. 

 

मुंबई लोकलमध्ये महिलांची हाणामारी... pic.twitter.com/m8BQHGmBqs

— Datta Lawande (@datta_lawande96) October 6, 2022

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు