రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మేర్‌లో ఓ నర్సు చేసిన పనికి ఓ పసికందు శరీరం రెండుముక్కలైంది. దీంతో నిండు నూరేళ్ళూ జీవించాల్సిన ఆ బిడ్డ ఈ లోకాన్ని చూడకుండానే తనువు చాలించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
రాష్ట్రంలోని జైసల్మేర్‌లోని రాంగఢ్ ఆరోగ్య కేంద్రానికి దీపా కన్వర్ అనే మహిళ పురిటి నొప్పులతో ప్రసవానికి వచ్చింది. ఆ మహిళకు ప్రసవం చేస్తున్న ఓ మహిళ బిడ్డను బలవంతంగా బయటకులాగింది. దీంతో శిశువు రెండు ముక్కలైంది. బిడ్డ కాళ్లు, సగభాగం మాత్రమే బయటకు రాగా, తలభాగం మాత్రం గర్భంలోనే ఉండిపోయింది.
దీంతో ఆందోళన చెందిన ఆ నర్సు... ఆ మహిళకు మాయమాటలు చెప్పి, మాయ కడుపులోనే ఉండిపోయిందనీ, అందువల్ల మరో ఆస్పత్రికి వెళ్ళి మాయను తీయించుకోవాలంటూ సలహా ఇచ్చింది. దీంతో ఆమెను జోథ్‌పూర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెను పరిశీలించిన వైద్యులు.. విషయాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు వివరించారు. ఆ తర్వాత ఆపరేషన్ చేసి తల్లి ప్రాణాలు కాపాడారు.
ఈ సంఘటనతో హతాశులైన బంధువులు, దీక్ష భర్త తిలోక్ భాటి ఆస్పత్రి సిబ్బంది నిర్వాకంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించి తమ బిడ్డను పొట్టన పెట్టుకున్నారంటూ వాపోయారు. అంతేకాదు మద్యం సేవించిన ఆసుపత్రి సిబ్బంది తనతో అనుచితంగా ప్రవర్తించారని తిలోక్ భాటి ఆరోపించారు. ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు శిశువు మొండెం భాగాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.