మంచి మాటలు చెబుతున్నాడనీ తండ్రిపై కత్తితో కొడుకు దాడి.. ఎక్కడ?

మంగళవారం, 20 అక్టోబరు 2020 (13:00 IST)
చెడు తిరుగుళ్లు తిరగకుండా సత్ మార్గంలో నడుచుకోవాలంటూ నాలుగు మంచి మాటలు చెప్పిన తండ్రిపై ఓ కుమారుడు పైశాచికంగా దాడిచేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని జమునానగర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు జులాయ్‌గా తిరుగుతుండేవాడు. పైగా, కేంద్రం నిషేధించిన పబ్‌జీని గంటల కొద్దీ ఆడుతూ వుండేవాడు. దీన్ని గమనించిన తండ్రి... అన్ని గంటలు పబ్‌జీ ఆడకురా అని కుమారుడికి మంచి చెప్పాడు. ఇదే ఆ తండ్రి చేసిన పాపం. 
 
అంతే ఒక్కసారిగా ఆగ్రహానికి లోనైన కొడుకు.. నన్నే ఆడుకోవద్దంటావా అంటూ ఉన్మాదిగా మారి తండ్రిపై దాడికి తెగబడ్డాడు. కత్తితో ఆయన గొంతు కోసేశాడు. తండ్రి రక్తంతో తడిసిన దుస్తులతో అలాగే వడివడిగా ఇంట్లోంచి బయటకొచ్చాడు.
 
అంతటితో ఆగక.. తనకు ఎదురుపడిన వారందరిపై దాడి చేసే ప్రయత్నం చేశాడు. తాను ఏం చేస్తున్నాడో తెలియనిస్థితిలో ఉన్న అతడు తనను తాను కూడా గాయపరుచుకున్నాడు. ఈ ఘటనలో తండ్రికి తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం తండ్రి కొడుకులిద్దరూ మీరట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు