బీజేపీ నేత, కేంద్రమంత్రి నాయకురాలు ఉమా భారతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన వరకు నరేంద్ర మోడీ ప్రధాని కావడం, సోదరుడు యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి కావడం ఈ 21వ శతాబ్దంలో అత్యుత్తమ వార్తలని ఉమా భారతి తెలిపారు. జాతీయవాదం, అభివృద్ధి కలయికగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాన్ని యోగి ఆదిత్యనాథ్ నడిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మోడీ ప్రధానిగా, ఆదిత్య సీఎంగా ఎంపిక కావడం ఈ శతాబ్దంలోనే పెద్ద న్యూస్ అన్నారు.
ఉత్తరప్రదేశ్లో అభివృద్ధిపై యోగి దృష్టి సారిస్తారని, విపక్ష నేతలకు ఇది చెంపపెట్టులా ఆయన పాలన ఉంటుందని తెలిపారు. ఐదుసార్లు లోకసభ ఎంపీగా ఎన్నికైన యోగి ఆదిత్యనాథ్ యూపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. మరోవైపు, ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎటువంటి ఆర్భాటాలకు పోవద్దని ఆదిత్యనాథ్ కార్యకర్తలను హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా ఎవరూ ప్రవర్తించవద్దని, అటువంటి కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలకు తీసుకోవాల్సి వస్తుందని చెప్పారు.