ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేశారు. ఈ నిర్ణయంపై ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా నోరెత్తకుండా ఆయన వివరణ కూడా ఇచ్చారు. యూపీలోని అన్ని ప్రైవేట్ వైద్య కాలేజీల్లో రిజర్వేషన్లను ఎత్తివేశారు. ప్రైవేట్ కాలేజీలకు వెళ్లే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు రిజర్వేషన్లు ఎందుకంటూ ఆయన ప్రశ్నించారు. ముఖ్యంగా ప్రైవేట్ వైద్య కాలేజీలకు వెళుతున్నారంటే ఖచ్చితంగా వారు ధనవంతులై ఉంటారని, అలాంటివారికి రిజర్వేషన్లు ఎందుకంటూ ముఖ్యమంత్రి ప్రశ్నించారు. కానీ, ప్రభుత్వ విద్యాసంస్థల్లో మాత్రం ఈ రిజర్వేషన్లు యధావిధిగా కొనసాగుతుందని తెలిపారు.
మరోవైపు ట్రిపుల్ తలాక్‌పై ఆయన సంచలన ప్రకటన చేశారు. ట్రిపుల్ తలాక్‌పై మౌనం వహించడదం ద్రౌపది మానభంగం వంటిదేనని అభిప్రాయపడ్డారు. ట్రిపుల్ తలాక్ స్వస్తి పలకాలని, దేశంలో ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయాలని ఆయన గట్టిగా కోరారు. ట్రిపుల్ తలాక్‌పై ప్రజలు మౌనం వహించడాన్ని చూస్తే తనకు మహాభారతంలోని కథ గుర్తుకు వస్తుందని ఆయన అన్నారు.
ట్రిపుల్ తలాక్ సమస్యను భువనేశ్వరి బీజేపీ కార్యవర్గ సమావేశంలో ప్రధాని మోడీ ప్రస్తావిస్తూ... ముస్లిం మహిళలకు తాము న్యాయం చేస్తామని చెప్పారు. ట్రిపుల్ తలాక్‌ను తాను వ్యతిరేకిస్తున్నట్లు సూచనప్రాయంగా చెబుతూ సాంఘిక దురాచారాలు ఉన్నాయని, సమాజం మేల్కొని బాధితులకు న్యాయం చేయడానికి ప్రయత్నించాలని అన్నారు.