ఫ్రెండ్‌తో కలిసి బయటకెళ్లిన యువతిపై సామూహిక అత్యాచారం...

మంగళవారం, 8 జూన్ 2021 (11:14 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. తన స్నేహితులతో కలిసి బయటకెళ్ళిన ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. బరేలీలో గత నెల 31న జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. నిందితుల్లో ముగ్గురిని ఇప్పటికే అరెస్టు చేయగా, మిగతా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
 
పోలీసుల కథనం ప్రకారం.. బాధిత యువతి తన స్నేహితులైన ఇద్దరు యువకులతో కలిసి స్కూటీపై బయటకు వెళ్లింది. ఈ క్రమంలో వారిని అడ్డగించిన ఓ యువకుడు తన స్నేహితులను అక్కడికి పిలిపించాడు. 
 
వారొచ్చి బాధితురాలి స్నేహితులను బెదిరించి అక్కడి నుంచి పంపేసి యువతిపై వారంతా అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమె వద్దనున్న డబ్బులు తీసుకుని పరారయ్యారు.
 
జరిగిన ఘోరం గురించి పెదవి విప్పని బాధితురాలు తాజాగా తన సోదరికి వివరించింది. దీంతో ఆమె కుటుంబ సభ్యుల సహకారంతో శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను గుర్తించారు. ఆదివారం వారిని పట్టుకునేందుకు వెళ్లగా పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయేందుకు ప్రయత్నించారు. 
 
అయినా వెనక్కి తగ్గని పోలీసులు  ఓ నిందితుడి కాలుపై కాల్చడంతో ఇద్దరు నిందితులు చిక్కారు. వారిని విశాల్ పటేల్ (22), అనుజ్ పటేల్ (23) గా గుర్తించారు. సోమవారం మరో నిందితుడిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు