రాజ్యసభలో కంటతడి పెట్టిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు..

సోమవారం, 29 జులై 2019 (19:45 IST)
సోమవారం రాజ్యసభలో దివంగత నేత జైపాల్‌రెడ్డికి నివాళులు అర్పిస్తూ జైపాల్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. జైపాల్ రెడ్డి గొప్ప ఆదర్శవంతమైన నేత అని మంచి పాలనాదక్షుడని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆయనతో కలిసి పనిచేసే అదృష్టం తనకు దక్కిందని చెపుతూ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు వెంకయ్యనాయుడు. 
 
నాడు అసెంబ్లీ 8 గంటలకు ప్రారంభమైతే మేమిద్దరం 7 గంటలకే అసెంబ్లీకి చేరుకుని వివిధ అంశాలపై చర్చించుకునేవాళ్లం అని గుర్తు చేసుకున్నారు. అసెంబ్లీ జరుగుతున్నప్పుడు బ్రేక్ ఫాస్ట్, లంచ్ అవర్‌లో తరచు కలుసుకునేవారమని ఆ రోజులను గుర్తుచేసుకున్నారు వెంకయ్యనాయుడు. ఇద్దరం వేరు వేరు పార్టీలకు ప్రాతినిధ్యం వహించినా ప్రజాసమస్యలపై ఎవరి పంధాలో వారు వాదన చేసే వాళ్లం' అని జైపాల్‌ రెడ్డితో 40 ఏళ్లుగా తనకున్న అనుబంధాన్ని వెంకయ్యనాయుడు సభ్యులకు వివరించారు.
 
జైపాల్‌ రెడ్డికి విషయ పరిజ్ఞానం ఎక్కువని, ఏ అంశం మీద చర్చ జరిగినా లోతైన అవగాహనతో మాట్లాడేవారని, తెలుగు, ఇంగ్లీషు, హిందీ... ఇలా వివిధ భాషల్లో మంచి పట్టు ఉన్న ఉత్తమ పార్లమెంటేరియన్ అని కొనియాడారు. జైపాల్ ఇక లేరన్న సమాచారం తనను తీవ్రంగా బాధించిందని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు