ఆజాత శత్రువు జైపాల్ రెడ్డి... రాజకీయ విశేషాలు..

ఆదివారం, 28 జులై 2019 (09:04 IST)
కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ నేత, ఆజాతశత్రువు ఎస్.జైపాల్‌ రెడ్డి ఇకలేరు. ఆయన కొంతకాలంగా ఆయన నిమోనియాతో బాధపడుతూ వచ్చిన ఆయన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం (జులై 27, 2019)వ తేదీ అర్థరాత్రి 1.28 గంటలకు మరణించారు. ఆయన భౌతికకాయాన్ని జూబ్లీహిల్స్‌లోని స్వగృహానికి తరలించారు.
 
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా మాడుగులలో 1942 జనవరి 16న జైపాల్ రెడ్డి జన్మించారు. ఆయన తల్లిదండ్రులు సూదిని దుర్గారెడ్డి, యశోదమ్మ. జైపాల్ రెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. నల్గొండ జిల్లా దేవరకొండలో జైపాల్‌ రెడ్డి ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేయగా ఓయూలో ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్, బీసీజే చదివారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ పట్టా పొందారు.
 
విద్యార్థి దశ నుంచే జైపాల్‌రెడ్డి రాజకీయాలపై ఆసక్తి చూపారు. విద్యార్థి నాయకుడిగా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చారు. 1965-71 వరకు ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఐదు సార్లు ఎంపీగా, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 
 
రెండుసార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. కాంగ్రెస్ ఎమర్జెన్సీ పాలనను వ్యతిరేకిస్తూ ఆ పార్టీకి రాజీనామా చేసి, 1977లో జనతా పార్టీలో చేరారు. 1985 నుంచి 88 వరకు జనతాపార్టీలో ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.
 
జైపాల్ రెడ్డి 1969లో తొలిసారి మహబూబ్‌నగర్‌ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అదే నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు గెలుపొందారు. 1984లో మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి తొలిసారి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. 1990, 1996లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. జూన్‌ 1991 నుంచి 1992 వరకు రాజ్యసభాపక్ష నేతగా వ్యవహరించారు. 1999, 2004లో మిర్యాలగూడ నుంచి ఎంపీగా గెలుపొందారు. 
 
1999 నుంచి 2000 వరకు సభాహక్కుల ఉల్లంఘన కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. 1998లో ఐకే గుజ్రాల్ కేబినెట్‌లో కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1999లో కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరారు. 
 
మన్మోహన్‌సింగ్‌ హయాంలో పెట్రోలియం, పట్టణాభివృద్ధి, సాంస్కృతిక శాఖ మంత్రిగా పనిచేశారు. 1998లో ఉత్తమ పార్లమెంటేరియన్‌గా పురస్కారం అందుకున్నారు. దక్షిణాది నుంచి తొలిసారి ఉత్తమ పార్లమెంటేరియన్‌ పురస్కారం అందుకున్న నేతగా జైపాల్‌రెడ్డి గుర్తింపు పొందారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు