ఉపరాష్ట్రపదవి రాజకీయ ఉద్యోగం కాదు : జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి

ఠాగూర్

శనివారం, 6 సెప్టెంబరు 2025 (11:08 IST)
దేశ ఉపరాష్ట్ర పదవి అనేది ఒక రాజకీయ ఉద్యోగం కాదని అది ఉన్నతమైన రాజ్యాంగబద్ధమైన పదవి అని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి అన్నారు. ఆ పదవిలో కూర్చునే వ్యక్తికి న్యాయమూర్తికి ఉండాల్సిన లక్షణాలైన నిష్పక్షపాతం, హేతుబద్ధత, న్యాయమైన వైఖరి తప్పనిసరిగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. 
 
సెప్టెంబర్ 9న జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి ఉమ్మడి అభ్యర్థిగా ఆయన బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి తరపున పోటీ చేస్తున్నారు. ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం గౌహతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. 
 
'ఉపరాష్ట్రపతి కార్యాలయాన్ని రోజువారీ రాజకీయాలతో ముడిపెట్టి చూడకూడదు. మాటల్లో, చేతల్లో, పనుల్లో నిష్పక్షపాతంగా, న్యాయంగా వ్యవహరించే గుణం ఆ పదవికి అవసరం. ఉపరాష్ట్రపతి పదవిపై నాకు ఉన్న అవగాహన ఇదే' అని సుదర్శన్ రెడ్డి వివరించారు. అదేసమయంలో మాజీ ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖర్ పదవీకాలం ముగియకముందే రాజీనామా చేయడంపై వ్యాఖ్యానించేందుకు ఆయన నిరాకరించారు.
 
ఈ సందర్భంగా తన గెలుపుపై సుదర్శన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఏ పార్టీ కూడా తమ ఎంపీలకు విప్ జారీ చేసే అవకాశం లేదని, సభ్యులు తమ అంతరాత్మ ప్రబోధం మేరకు ఓటు వేయవచ్చని గుర్తుచేశారు. "పార్లమెంటు సభ్యులు, మీడియా, పౌర సమాజం, మేధావులు, రచయితలు, సాంస్కృతిక రంగ ప్రముఖుల నుంచి నాకు లభిస్తున్న స్పందన చూస్తుంటే నా గెలుపు ఖాయమనిపిస్తోంది" అని ఆయన అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు