రాష్ట్రపతి భవన్ చరిత్రలోనే తొలిసారి... సీఆర్‌పీఎఫ్ ఉద్యోగికి అరుదైన గౌరవం...

ఠాగూర్

ఆదివారం, 2 ఫిబ్రవరి 2025 (09:30 IST)
రాష్ట్రపతి భవన్ చరిత్రలో తొలిసారి ఓ ఉద్యోగి వివాహానికి భవన్ వేదికకానుంది. రాష్ట్రపతి వ్యక్తిగత భద్రతాధికారి (పీఎస్‌వో)గా విధులు నిర్వహిస్తున్న సీఆర్‌పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ పూనమ్ గుప్తా వివాహం జరుపుకునేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక అనుమతిచ్చారు. దీంతో ఈ నెల 12న పూనమ్ గుప్తా వివాహం రాష్ట్రపతి భవన్‌లోని మదర్ థెరిస్సా క్రౌన్ కాంప్లెక్స్‌లో జరుగనుంది. 
 
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో సీఆర్‌పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్‌గా సేవలందిస్తున్న అవనీశ్ కుమార్‌తో పూనమ్ గుప్తా ఏడడుగులు వేయనున్నారు. వరుడు కూడా సీఆర్‌పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ కావడంతో రాష్ట్రపతి ఈ ప్రత్యేక అనుమతినిచ్చినట్లు తెలుస్తోంది. భద్రతాపరమైన కారణాల దృష్ట్యా ఈ వివాహ వేడుకకు అతికొద్దిమంది బంధువులు, అత్యంత సన్నిహితులకు మాత్రమే ఆహ్వానం అందినట్లు సమాచారం. 
 
కాగా, మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పూనమ్ గుప్తా 2018లో యూపీఎస్సీ నిర్వహించిన సీఏపీఎఫ్ పరీక్షలో 81వ ర్యాంక్ సాధించారు. ఇటీవల జరిగిన గణతంత్ర వేడుకల్లో సీఆర్పీఎఫ్ మహిళా దళానికి పూనమ్ గుప్తా సారథ్యం వహించిన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు